సాగు నీటి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎపి చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తామే నిద్రలేపామన్నారు. బనకచర్ల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని గట్టిగా పోరాటం చేశామని చెప్పారు. అప్పుడు ప్రభుత్వం స్పందించిందన్నారు. ఈ ప్రాజెక్టుపై ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో కేంద్రం సమావేశం కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు.
అయితే, ఈ సమావేశానికి వెళ్లొద్దని సిఎం రేవంత్ కు సూచించామని.. అయినా, మీటింగ్‌కు వెళ్లి సిఎం సంతకం చేశారని హరీష్ రావు మండిపడ్డారు. మీటింగ్ అనంతరం బయటకొచ్చి.. బనకచర్లపై చర్చే జరగలేదని సిఎం రేవంత్ చెప్పారని… కానీ బనకచర్లపై చర్చ జరిగిందని ఎపి మంత్రి బయటపెట్టారని ఆయన చెప్పారు. బనకచర్లపై కర్ణాటక, మహారాష్ట్ర అభ్యంతరం తెలిపాయని.. గోదావరి నీళ్లు, కృష్ణాలో కలిస్తే బచావత్ అవార్డు వర్తిస్తుందన్నారు. మొదట, ఎపి ప్రభుత్వం బనకచర్ల ద్వారా జలదోపిడి చేయాలనుకుందని.. ఇప్పుడు నల్లమలసాగర్ పేరుతో దోపిడి చేయబోతుందని హరీష్ రావు ఆరోపించారు.