హైదరాబాద్: సంక్రాంతికి వెళ్లేవారికి ఇబ్బందులు లేకుండా చూడాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలిపారు. గతంలో ఎదురైనా అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. రహదారిపై రద్దీ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై కోమటిరెడ్డి సమీక్ష జరిపారు. హైదరాబాద్ – విజయవాడ హైవేపై జనవరి 8 నుంచి వాహనాల రద్దీ ఎక్కువ ఉంటుందని, రోజుకు సుమారు లక్ష వాహనాల ప్రయాణం సాగుతుందని తెలియజేశారు. వాహనాల రద్దీపై అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రేపు తూప్రాన్ పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో పర్యటిస్తానని కోమటి రెడ్డి పేర్కొన్నారు. ఎల్బీనగర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ వరకు రద్దీ ఎక్కువగా ఉంటుందని, జాతీయరహదారిపై వాహనాలు ఆగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పండగ రద్దీ ఉన్న రోజుల్లో భారీ యంత్రాలతో జరిగే పనులు నిలిపివేయాలని, అత్యవసరంగా చేయాల్సిన పనులు రాత్రి వేళల్లో మాత్రమే చేయాలని అన్నారు. అన్ని రహదారుల లేన్లు వాహనాల రాకపోకలకు అందుబాటులో ఉంచాలని, రోడ్డు పనులు జరుగుతున్న ప్రతి చోట ట్రాఫిక్ బోర్డులు పెట్టాలని చెప్పారు. ట్రాఫిక్ మళ్లింపులు, నియంత్రణ అంశాల్లో సమన్వయం పాటించాలని, టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగకుండా వెళ్లేలా అదనపు బృందాలు మోహరించాలని కోమటి రెడ్డి ఆదేశించారు.