హైదరాబాద్: తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులోకి ఉన్నాయని డిజిపి శివధర్ రెడ్డి తెలిపారు. గ్రామపంచాయితీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు. తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక-2025 డిజిపి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వచ్చిన వరదలను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, గతంలో ఎప్పుడూ ఇలాంటి వరదలు నిజామాబాద్ లో రాలేదని చెప్పారు. వరదల సమయంలో పోలీస్ సిబ్బంది బాగా పనిచేసి ప్రాణనష్టం లేకుండా చూశారని, తెలంగాణలో 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలియజేశారు. ఎలాంటి సమస్యలు లేకుండా మిస్ వరల్డ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించుకున్నామని, రాష్ట్రంలో వివిధ కేసులను లోక్ అదాలత్ లో పెద్దసంఖ్యలో పరిష్కరించామని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో కీలక పదవుల్లో మహిళా అధికారులు పనిచేస్తున్నారని, ఫోన్ల రికవరీ విషయంలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ లో ఉందని కొనియాడారు. సైబర్ క్రైమ్ విషయంలో రాష్ట్రంలో 3 శాతం, గతంలో పోలిస్తే 2.33 శాతం నేరం తగ్గిందని అన్నారు. గతంలో 2.34 లక్షల కేసుల నమోదు కాగా ఇప్పుడు 2.28 లక్షల కేసులు నమోదు అయ్యాయని, రాష్ట్రంలో బిఎన్ఎస్ కేసుల సంఖ్య 1.5 శాతం తగ్గిందని డిజిపి శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.