’పతంగ్’ చిత్రం విషయంలో నాకు వస్తున్న అభినందనలు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాను ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తుంటే నా కష్టానికి తగిన ప్రతిఫలం లభించినట్లు అనిపిస్తోందని అన్నారు దర్శకుడు ప్రణీత్ పత్తిపాటి. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం పతంగ్. ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని సినిమాటిక్ ఎలిమెంట్స్, రిష్న్ సినిమాస్, మాన్‌సూన్ టేల్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఈ స్పోర్ట్ డ్రామా చిత్రానికి విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మకా, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు.
ఈ చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు ప్రణీత్ పత్తిపాటి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “ఓ మంచి సినిమా చూశామన్న సంతృప్తిని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా పతాక సన్నివేశాలు ఓ స్టేడియంలో ఓ మ్యాచ్‌ను చూస్తున్న అనుభూతిని కలిగిస్తున్నాయి. ఈ సినిమా చూసి దిల్ రాజు, ఎస్‌కేఎన్, సందీప్‌కిషన్, బెల్లంకొండ సురేష్‌లు ఎంతో మెచ్చుకున్నారు”అని తెలిపారు.