ఎన్నికల ప్రజాస్వామ్యం ప్రధాన లక్షం ప్రజాప్రాతినిధ్యం ద్వారా పాలనా వ్యవస్థను నెలకొల్పడమే. అలా కాకుండా ప్రజలను అణగదొక్కడానికి, తమ అడుగులకు మడుగులొత్తుతున్న పరమ విధేయులను అభ్యర్థులుగా పోటీకి నిలబెట్టడం నిజంగా అత్యంత మోసపూరిత ఎన్నికల ప్రహసనమే అవుతుంది. అంగ్‌సాన్ సూకీ తదితర నేతలు ఇంకా జైలు లోనే మగ్గుతుండగా, 40 కి పైగా రాజకీయ పార్టీలను జుంటా నిషేధించింది. జుంటా నిర్వహించిన జనాభా గణన ప్రకారం దేశం లోని 5.1 కోట్ల మందిలో దాదాపు 1.9 కోట్ల మంది వివరాల సేకరణే జరగలేదు. ఇప్పుడు మయన్మార్‌లో మూడు దశలుగా జరుగుతున్న ఎన్నికలు ఈ పరిస్థితికి దర్పణం పడుతున్నాయి. చైనా, రష్యా, బెలారస్ ఈ ఎన్నికలకు మద్దతు ఇవ్వడంలో అనేక వ్యూహాత్మక, భౌగోళిక, వాణిజ్య, సామ్రాజ్య విస్తరణ అంశాలు ముడిపడి ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికలు సరైన ఫలితాలు ఇవ్వవని ప్రజలు ఇష్టపడకపోయినా ఓటు వేయాలంటూ తుపాకీ తో జుంటా ప్రభుత్వం బెదిరిస్తోంది. ఒక విధంగా తుపాకీనీడలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. మయన్మార్ సైనిక అధికారులు ఓటు వేయాలని ప్రజలను బలవంతం చేయడానికి బెదిరించడం, హింసించడం ఆపాలని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ సంచలన ప్రకటన చేయడం పరిశీలిస్తే మయన్మార్ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో అంచనా వేయవచ్చు.
ఐదేళ్ల క్రితం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కుప్పకూలదోసి అంతర్యుద్ధాన్ని తెరపైకి తీసుకు వచ్చిన మిలిటరీ ‘జుంటా’ నేతృత్వంలోనే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్య పాలనకు జుంటా ఎంతవరకు పట్టం కడుతుందో అందరికీ తెలిసిందే. 2021 ఫిబ్రవరిలో జరిగిన సైనిక తిరుగుబాటు మయన్మార్ ప్రజల ఆశలను అడుగంటించి అంగ్‌సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో ఎన్నికలు జరిపిస్తుండటం మరింత శక్తిని కూటగట్టుకునేందుకే అన్నది జగమెరిగిన సత్యం. మూడు దశల్లో తొలిదశ 102 టౌన్‌షిప్‌లకు పోలింగ్ డిసెంబర్ 28న జరిగింది. తరువాత రెండో దశ పోలింగ్ జనవరి 11న 100 టౌన్‌షిప్‌లకు, మూడోదశ పోలింగ్ జనవరి 25న 63 టౌన్‌షిప్‌లకు జరగనుంది. 2020 నాటి ఎన్నికల్లో పాల్గొన్న ఇప్పుడు చెరసాలలో బందీగా ఉన్న నాయకురాలు అంగ్‌సాన్ సూకీ నేతృత్వం లోని విజేత పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డీ)తోసహా ప్రధాన పార్టీలేవీ ఈసారి పోటీలో లేకపోవడం ప్రత్యేకంగా గమనించవలసి ఉంది. మాజీ జుంటా ప్రతినిధులతో కూడిన యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ (యుఎస్‌డిపి) ఒక్కటే ఒక దళంగా పోటీలో ఉంది. ఇది 2008 రాజ్యాంగం నీడలో నిర్వహించిన 2010 నాటి ఎన్నికల చిత్రాన్ని ప్రతిబింబిస్తోంది. ఆనాడు ఎన్‌ఎల్‌డి ఎన్నికలను బహిష్కరించింది. యుఎస్‌డిపి ఒక్కటే గెలుపొందింది. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది.
గత ఐదేళ్లుగా జుంటా సైనిక ప్రభుత్వం బాంబు దాడులతో వేలాది మంది పౌరులను బలగొంది. 1960 నుంచి సైనిక ప్రభుత్వం తీవ్ర ప్రజాపోరాటాలను ఎదుర్కొంటోంది. సాయుధగ్రూపులు, ఎన్‌ఎల్‌డి అనుబంధ పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ (పిడిఎఫ్), విపక్ష నేషనల్ యూనిటీ గవర్నమెంట్‌కు విధేయులైన, ఎన్‌ఎల్‌డి బహిష్కరించిన, వర్గాలు మయన్మార్‌లో చెప్పుకోదగిన భూభాగాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి.2023 ఆఖరులో చైనా ఆయుధ సాయంతో త్రీబ్రదర్ హుడ్ అలియన్స్ (టిబిఎ) అనే సంకీర్ణ కూటమి చైనా సరిహద్దు లోని టౌన్‌షిప్‌లతో సహా షాన్ రాష్ట్రం, రఖైన్ తదితర టౌన్‌షిప్‌లను చేజిక్కించుకోవడం జుంటాకు గట్టిదెబ్బ. 2025లో చైనా వైఖరి మార్చుకునే వరకు జుంటాకు రష్యా, బెలరూసియన్ ఆయుధ సాయం అందేది. భౌగోళిక, ఆర్థిక ప్రాధాన్యతలతోపాటు హిందూ మహాసముద్ర తీర ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని చైనా జుంటాకు వెన్నుదన్నుగా నిలిచింది. చైనా ఒత్తిడితో శత్రుత్వాలను ఆపి తిరిగి జుంటాకే అధికారం దక్కేలా చేసింది. అయినా జుంటా రఖైన్, కరెన్నీ, కరెన్, చిన్ రాష్ట్రాల్లో తిరుగుబాటు పోరాటాలను తరుచుగా ఎదుర్కోవలసి వస్తోంది. సాగాయింగ్ రీజియన్‌లో జుంటాకు ఏమాత్రం నియంత్రణ లేని మొక్కుబడి పెత్తనమే మిగిలింది. మయన్మార్‌లోని సగం కంటే ఎక్కువ భాగం ప్రస్తుత సైనిక నియంత్రణలో లేదు.వివిధ జాతుల సాయుధ బలగాలు, పీపుల్స్ డిఫెన్స్‌ఫోర్స్‌లతో జుంటా అనేక ప్రతిఘటనలను ఎదుర్కొంటోంది.
మయన్మార్ రాజధాని నుంచి, జుంటా అధీనంలో ఉన్న భూభాగాల నుంచి వస్తున్న విశ్లేషణలు పరిశీలిస్తే 2020 కన్నా ఇప్పుడు ప్రజా పార్టీల ప్రాతినిధ్యం చాలా వరకు తక్కువే అని తెలుస్తోంది. తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఎన్నికల ద్వారా గెలుపు పొందడానికి, అలాగే తమ పాలనకు చట్టబద్ధత సాధించాలన్నదే జుంటా తాపత్రయం. తాను అనుకున్నది నెరవేరకుంటే అంతర్యుద్ధంతో అల్లకల్లోలం సృష్టించి రక్తపాతానికైనా జుంటా సాహసిస్తుంది. టిన్‌పాట్ నాయకుడు మిన్ అంగ్ హ్లెంగ్ నేతృత్వంలోని జుంటా సైనిక ప్రభుత్వం ఇంతవరకు ఎన్నికలు కాని శాసనసభ స్థానాల్లో కనీసం 25% అయినా రాజ్యాంగబద్ధంగా దక్కించుకుంటాదన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఫలితాలతో సంబంధం లేకుండా సైన్యం ఆధిపత్యమే చెలాయిస్తుందని భావిస్తున్నారు. కానీ చరిత్ర ఒక మార్గదర్శకంగా ఉంటే బూటకపు బెదిరింపు ఎత్తుగడలతో నిర్వహిస్తున్న ఈ ఎన్నికలు ప్రజల మద్దతును పొందలేవు. అలాంటి వ్యతిరేక ఫలితాలు వస్తే మయన్మార్ మరిన్ని సంక్లిష్ట సంఘర్షణలకు సిద్ధం కావలసి వస్తుంది.