పశ్చిమ బెంగాల్ ప్రస్తుతం ఒక నిర్ణయాత్మక రాజకీయ పర్వంలో ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రం సిద్ధమవుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ 2011లో లెఫ్ట్ ఫ్రంట్‌ను ఓడించినన తర్వాత తొలిసారిగా రాష్ట్ర రాజకీయ వాతావరణం కాస్త గందరగోళంగా, అస్థిరంగా ఉంది. ఒకప్పుడు మమతా బెనర్జీకి ఎదురులేదు. ఆమె వ్యక్తిత్వం, మార్పు తీసుకువస్తానన్న ఆమె వాగ్దానం చుట్టూ తిరిగిన రాజకీయ కథనం ప్రస్తుతం మరింత గందరగోళాన్ని ప్రతిబింబిస్తోంది. 15 సంవత్సరాలు అధికారంలో ఉన్న టిఎంసి సర్కార్‌కు ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగానే ఉంది. ఇక బిజెపి రాష్ట్రంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒకప్పుడు దాదాపు కనుమరుగైన స్థితినుంచి వామపక్షాలు కోలుకుని కాస్త తమ ఉనికిని చాటుకుంటున్నాయి. ఇక కోల్‌కతా సివిల్ పోల్స్ ఫలితాలు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షోలు సంస్థాగత జోక్యం, రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో మారుతున్న రాజకీయ సెంటిమెంట్లు రాబోయే ఎన్నికల ఫలితాలు 2021 మాదిరిగా ఉండబోవని సూచిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో రాజకీయచిత్రం మారవచ్చు. త్రిముఖ పోటీలే ఉండవచ్చు. ప్రతి పార్టీ మరో పార్టీతోనే కాక, సొంత పార్టీలో తిరుగుబాటుదారులతో గట్టి పోటీ ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు.
మమతా బెనర్జీ పార్టీ ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సవాల్ ప్రజల విశ్వాసం దెబ్బతినడం. 15 ఏళ్ల పాలన ప్రభుత్వ వ్యతిరేకతనే కాదు పాలకులకు అలసటను కూడా తెస్తుంది. ప్రభుత్వ నియామకాల్లో అవినీతి ఆరోపణలు, స్థానిక విద్యుత్ బ్రోకర్లపై పెరుగుతున్న ఆగ్రహం, సంక్షేమ పథకాల లబ్ధి పంపిణీలో రాజకీయ జోక్యంపై ఆందోళనలు ఉండనే ఉన్నాయి. ఒకప్పుడు భావోద్వేగశక్తిగా, విప్లవాత్మకంగా భావించిన మా మాటీ -మనుష్ కథనం ఆరోపణలకు కేంద్రంగా మారింది. అధికార వికేంద్రీకరణ వల్ల కొన్ని చోట్ల నియంత్రణ మరింత కఠినంగా మారింది. అయినా, బెంగాల్‌లో ప్రభుత్వ వ్యతిరేకత అంత తీవ్ర స్థాయిలో లేదు. వ్యవస్థపై అసంతృప్తి ఉన్నా, మమతా బెనర్జీని తిరస్కరించే అంతగా మారలేదు. రాష్ట్రంలో పేద కుటుంబాలకు అండగా మమతా ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్ష్మీ భండార్, కన్యశ్రీ, స్వాస్థ్యా సతి, రూపశ్రీ వంటి సంక్షేమ పథకాలు ఆమెకు వ్యక్తిగతంగా తిరిగి అధికారం అందించే గ్యారంటీగా నిలుస్తున్నాయి.
ఈ కార్యక్రమాలు విధానపరమైనవే కాక, సామాజిక సంబంధాలను పెంచడంలో కీలకంగా పని చేస్తాయి. లబ్ధిదారుల నెట్‌వర్క్‌ను సృష్టించి, పాలనను అంచనా వేసేందుకు తోడ్పడతాయి. అందుకే బెంగాల్‌లో ఉన్న సెంటిమెంట్ ప్రభుత్వంలో మార్పును డిమాండ్ చేసే స్థాయిలో లేదు. టిఎంసి ప్రభుత్వం స్థానిక నాయకత్వంపై వస్తున్న ఆరోపణలను చక్కదిద్ది, సజావుగా సంక్షేమం అందేటట్లు చూడగలమని ఒప్పించాలి. ప్రభుత్వం మనుగడ సాగించాలంటే ఇది తప్పదు. మమతా బెనర్జీ ప్రజలలో విశ్వాసాన్ని పునరుద్ధరించి, అధికారం తిరిగి చేజిక్కించుకునేందుకు తగిన విధంగా మార్చగలరా అన్నదే అధికార పార్టీ ఎదుర్కొంటున్న ప్రశ్న. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో సంక్లిష్టతకు తగిన సమాధానం దొరికింది. టిఎంసి విజయం సాధించి మహా నగరంపై తన నియంత్రణ నిలుపుకుంది. పాలక పార్టీకి ప్రస్తుతానికి ముఖ్యమైన ఆధిక్యత లభించింది. కోల్‌కతా కేవలం ఓ నగరం కాదు. రాజకీయంగా బలమైన ఘనమైన అడ్డా. దానిని నిలుపుకోవడం వల్ల క్షేత్రస్థాయిలో విమర్శలు, ఎన్నికలలో ఓటర్ల మద్దతు తగ్గుతుందన్న వాదనలో అర్థం లేదనే ప్రభుత్వ ధీమాకు బలం చేకూరింది.
బిజెపికి సంబంధించినంత వరకూ స్థానిక ఎన్నికలు ఆ పార్టీ సంస్థాగత లోపాలను బయటపెట్టాయి. గత పార్లమెంటరీ ఎన్నికల్లో పార్టీ దీటైన బలాన్ని ప్రదర్శించినా, నగర రాజకీయాల యంత్రాంగంలో తనను మమేకమైపోయేందుకు చేస్తున్న కృషిలో అది చాలా కష్టపడింది. వార్డు స్థాయి నుంచి సంస్థాగతంగా బలోపేతం కాకపోవడం అభ్యర్థుల ఎంపికలో లోపాల వల్ల బిజెపి చెప్పినంత బలంగా తనను తాను నిరూపించుకోలేకపోయింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదేపదే పర్యటనలు, రోడ్ షోలు, ఘనమైన ప్రసంగాలు, ఈ లోపాన్ని సవరించడమే లక్ష్యంగా పెట్టుకుని సాగాయి. బెంగాల్‌ను కైవసం చేసుకోవడం తమ పరిధికి మించిన పనిగా అంగీకరించేందుకు బిజెపి ఇష్టపడడం లేదని ఆయన ఉనికి సూచిస్తోంది. ఈ రోడ్ షో వల్ల రెండు ప్రయోజనాలు. అవి పార్టీ కేడర్‌ను ఉత్తేజపరుస్తాయి. కేంద్ర నాయకత్వం తమకు రాష్ట్రంలో అండగా ఉందని మద్దతుదారులకు భరోసా కల్పిస్తాయి. అయినా, రాష్ట్రంలో నమ్మకమైన నాయకత్వం నిర్మాణంలో, అంతర్గత వర్గ వివాదాలు, అస్థిరతను చక్కదిద్దడంలో ఇటువంటి ప్రయోగాలు ఏమాత్రం పనిచేస్తాయనే ప్రశ్న మిగిలే ఉంది. బిజెపి ప్రచారం ఎక్కువగా శాంతి భద్రతలు పరిరక్షణ, రాజకీయ హింసను నిర్మూలన, సుస్థిరమైన పాలన వంటి వాగ్దానాలకే పరిమితమైంది. అయితే, దానిని విజయం అది ఏ మేరకు బెంగాల్ నిర్దుష్ట మోడల్ పాలన అందించగలదనే అంశంపైనే ఆధారపడి ఉంది.
మరో పక్క, లెఫ్ట్‌ఫ్రంట్ ఆచీతూచి అడుగులు వేస్తూ తన బలాన్ని పెంచుకునే స్థితిలో ఉంది. దీనిని పునరుజ్జీవనం గా అనలేం కానీ, పూర్తిగా తోసిపుచ్చలేం. కోల్‌కతా, అనేక జిల్లాలలో లెఫ్ట్‌ఫ్రంట్ ఓట్ల షేర్ మెరుగైంది. టిఎంసి, బిజెపి రెండింటి పట్ల భ్రమలు కోల్పోయిన ఒక వర్గం పాలక పక్షానికి ప్రత్యామ్నాయంగా కాకుండా రాజకీయ శూన్యం భర్తీ చేసేదిగా వామపక్షం వైపు చూస్తోంది. చాలామంది యువకులు, యువ ఓటర్లు, ముఖ్యంగా విద్యార్థులు, తొలిసారి ఓటు హక్కు పొందిన వారు వామపక్షాల వైపు మొగ్గుచూపుతున్నారు. వామపక్షం పాలనలో నిబద్ధతతో పని చేసిన పాలనా వ్యవస్థలను జ్ఞప్తి చేసుకుంటున్నారు. వామపక్షాలు గతంపై ఆధారపడకుండా, నిరుద్యోగం, ఆర్థిక అనిశ్చితి, సామాజిక ఆందోళనలను ఎదుర్కొంటున్న ఈ తరానికి తమ పాలన ఎలా ఉంటుందో వ్యక్తపరచి, నచ్చచెప్పడం, సందర్భోచితంగా మారడం అవసరం.
2026 ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రభంజనం వచ్చే అవకాశం లేనందున, సంప్రదింపులే కీలకం కాగలవు. సంఖ్యాపరంగా, సంస్థాగత కోణంలోనే కాక, పాలనాపరంగా టిఎంసి అధికారం వల్ల సంక్రమించిన ప్రయోజనాన్ని నిలుపుకుంటుంది. మమతా బెనర్జీ వ్యక్తిగత చరిష్మా, వ్యక్తిగతంగా ప్రజలతో మమేకమయ్యే స్వభావం, నాయకత్వం, సంక్షేమ పథకాలు ఆ పార్టీకి కొండంత బలం. బిజెపికి కేంద్రంలో జాతీయ స్థాయిలో అధికారం వల్ల ప్రయోజనం. ఎన్నికలను ఓ సైద్ధాంతిక పోరుగా మార్చే సామర్థ్యం, సమృద్ధిగా ఆర్థిక పరమైన వనరులు, మార్పు తీసుకు వస్తామని చేస్తున్న వాగ్దానం, ప్రజలను ఒప్పించే సామర్థ్యం అండగా నిలవవచ్చు.
వామపక్షాలు, కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల పరమైన వాదన కన్నా, నైతికపరమైన భరోసా కల్పించేందుకు సిద్ధమవుతున్నాయి. రాజకీయంగా తెరమరుగయ్యారని భావించే ఓటర్లకు, తక్షణ విజయం కోసం కాకపోయినా, ఆ రెండు పక్షాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలనుకునే వారికి తగిన ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశం ఉంది. బెంగాల్ ఓటర్లు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. బెంగాల్ లో రాజకీయపరమైన ప్రశ్న ఏమిటంటే, ఎవరు ఎవరిని ఓడించగలరు అని కాదు. ఎవరు విశ్వసనీయమైన పాలన అందించగలరు అన్నదే.
టిఎంసి ఓటర్లను గతంలో మాదిరిగానే ఆదరించమని అడుగుతోంది. బిజెపి తమను ప్రత్యామ్నాయంగా భావించి ఓటర్లు రిస్క్ తీసుకోవాలని కోరుతున్నాయి. ఇక వామపక్షాలు తమను కూడా మరో ప్రత్యామ్నాయంగా చూడాలని అడుగుతున్నాయి. ఈ ప్రతిపాదనలు ఏవీ విజయానికి హామీ ఇవ్వవు. సాధారణ రాజకీయాల విభిన్న దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. పశ్చిమ బెంగాల్ ఈ ఎన్నికల్లో రెండు వ్యక్తిత్వాలలో దేనివైపు మొగ్గుచూపాలనే రాష్ట్రంగా కాక, సొంత రాజకీయ భవిష్యత్ కోసం చర్చిస్తున్న రాష్ట్రంగా నిలుస్తున్నది. ప్రజలలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఈ చర్చలు ఎలా ఉన్నాయంటే, 2026 తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి. 15 ఏళ్లగా పాతుకుపోయిన సర్కార్‌ను కూల్చివేసి, కొత్త రాజకీయ వ్యవస్థను నిర్మిస్తే, వచ్చే ఐదేళ్లు ఆ క్రమం పరిణతి చెందుతుందా, మార్పు సాధ్యమవుతుందా, కొత్త దశ పోటీకి దారితీస్తుందా అనే గురించి కూడా కావచ్చు. కౌంట్ డౌన్ మొదలైంది. 2026లో ప్రజలు ఇచ్చే తీర్పు ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెడుతుందని కాక, బెంగాల్ ఏ పాలనా దృక్పథాన్ని విశ్వసించేందుకు సిద్ధంగా ఉందో వెల్లడిస్తుంది.
గీతార్థ పాఠక్