ఇటీవల ఒక సినిమా వేడుకలో 30 ఏళ్లుగా సినీ పరిశ్రమలో అనుభవం ఉన్న ఒక వ్యక్తి సినిమా కథానాయికల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు అన్ని సామాజిక మాధ్యమాల్లో, ఎలక్ట్రానిక్ మీడియా, న్యూస్ ఛానళ్లలో విశేషమైన చర్చకు అంశాలుగా మారాయి. సామాన్యులనుంచి ప్రముఖ విశ్లేషకులవరకు ముఖ్యంగా అధిక సంఖ్యలో మహిళలు వివిధ కోణాల్లో తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తపరుస్తున్నారు. అయితే, కొందరు ప్రముఖులు తమ వాదనల్లో ఎటువంటి ప్రామాణికత, నిర్మాణాత్మకత లేకపోయినా, వస్త్రధారణపై తమ వ్యక్తిగత అభిప్రాయాలను సమాజంపై బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీ-పురుషుల వస్త్రధారణ ఎలా ఉండాలి అనే అంశంపై స్పష్టత అవసరం. లేకపోతే భావితరాలకు ఒక తప్పుడు సందేశం వెళ్లే ప్రమాదం ఉంది. ఈ వ్యాసంలో వస్త్రధారణ మనిషి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినదా లేక సామాజిక బాధ్యతకు సంబంధించినదా అనే అంశాన్ని నిష్పక్షపాతంగా, మూలాలతోపాటు చర్చించి, వస్త్రధారణ విషయంలో నిజాన్ని నిర్భయంగా సమాజానికి చాటి చెప్పుదాం. మనిషి వ్యక్తిత్వ వికాసంలో వస్త్రధారణ కూడా ఒక ముఖ్యమైన అంశమే. చేసే వృత్తిని బట్టి, చదివే విద్యను బట్టి, వెళ్లే ప్రదేశాన్ని బట్టి కూడా మన వస్త్రధారణలో మార్పులు చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనం ధరించే వస్త్రాలు మన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయి. ఏ రకమైన వస్త్రాలు ధరించాలి అన్నది ప్రాంతాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, దేశాన్ని బట్టి మారుతుంటుంది.
అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే, శరీరాన్ని, సిగ్గును కాపాడే విధంగా వస్త్రాలు ధరించడమే ప్రధానమైనది. అది ఏ రకమైన వస్త్రమైనా కావచ్చు. వస్త్రధారణ స్వేచ్ఛకు సంబంధించిన విషయం కాదు. అది సమాజ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. మనిషి వ్యక్తిత్వంలోనూ, సమాజ సంస్కృతిలోనూ ఎంతో కీలకమైన స్థానమున్న వస్త్రాలను నిండుగా ధరించకుండా సమాజంలో తిరగడం స్వేచ్ఛ కాదు; అది ఒక అనాగరిక చర్య. ఇది మళ్లీ నాగరిక ప్రపంచం నుండి మనిషిని అనాగరిక ప్రపంచం వైపు తీసుకెళ్లే ప్రమాదకరమైన వాదన. స్త్రీలపై జరిగే అకృత్యాలకు వస్త్రధారణే కారణమని కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే, చాలీచాలని వస్త్రాలు ధరించిన మహిళలపైనే కాదు, సరైన రీతిలో వస్త్రాలు ధరించిన మహిళలపై కూడా లైంగిక దాడులు, వేధింపులు జరుగుతున్నాయి. ఇలాంటి అకృత్యాలకు పాల్పడేవారు మానవత్వాన్ని మరిచి మృగాల్లా ప్రవర్తించే సామాజిక ద్రోహులు. అలాంటి వారిపై ప్రభుత్వాలు కఠిన శిక్షలు విధించాలి, విధిస్తున్నాయి కూడా. అయితే, వస్త్రధారణ ఎలా ఉన్నా అకృత్యాలు జరుగుతున్నాయనే కారణంతో మాకు నచ్చినట్లు వస్త్రాలు ధరిస్తాం అనే వాదన చేయడం సమంజసం కాదు. ఇంటికి తాళం వేసినా కూడా దొంగతనాలు జరుగుతున్నాయని, ఇంటికి తాళం వేయడం మానేస్తామా?తాళంవేసిన ఇంటిలో దొంగతనాల శాతం తక్కువగా ఉంటుంది. తాళం వేయని ఇంటిలో దొంగతనాల శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన ఇంటికి తాళం వేసి ముందు జాగ్రత్త ఎలా తీసుకుంటామో, అదే విధంగా ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జాగ్రత్త అవసరం.
సమాజంలో పలుకుబడి, రక్షణ వలయాలు ఉన్న స్త్రీలు ఎటువంటి వస్త్రధారణ చేసినా వారికి భద్రత ఉంటుంది. వారిని చూసి సామాన్యులు కూడా అలాంటి వస్త్రాలను ధరించి సమాజంలో తిరిగితే, ప్రతి ఆడపిల్లకు అలాంటి రక్షణ ఉండదు. ప్రభుత్వాల సైతం ఎంతమందికి రక్షణ కల్పించగలుగుతాయి. అందుకే, ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రతి ఆడపిల్ల తన వ్యక్తిగత భద్రత కోసం సమాజానికి అనుగుణంగా, సరిగా వస్త్రాలు ధరించడం ఒక ప్రాథమిక జాగ్రత్త. ఇది నింద కాదు, బాధ్యత. దుష్ట ఆలోచనతో చూసే దృష్టిని మార్చుకోవాలి అన్నది నిజమే. కానీ విశ్లేషణ వేదికలపై కూర్చొని చెప్పే ఇలాంటి సందేశాలతో వెంటనే దుష్టులను, వారి దుష్ట ఆలోచనలను మార్చలేం. అందుకే సంస్కారవంతులైన మనమే జాగ్రత్తగా ఉండాలి. చూసే వారి దృష్టే తప్పు అనే వాదంతో మాత్రమే ముందుకు వెళ్లలేం. ఎందుకంటే సమాజంలో మంచి ఉన్నట్లే చెడు కూడా ఉంది అనే సత్యాన్ని మనం మర్చిపోవద్దు. సమాజంలో స్త్రీకి అత్యంత ఉత్తమమైన స్థానం ఉంది. అందుకే స్త్రీని కుటుంబ గౌరవంగా, సంస్కృతికి, విలువలకు ప్రతిరూపంగా, సాక్షాత్తు అమ్మవారులాగా గౌరవిస్తారు. అందుకే అలాంటి స్త్రీ వస్త్రధారణపై ఒక్కొక్కసారి ఇలాంటి చర్చలు జరుగుతూ ఉంటాయి. అది స్త్రీ మీద ఉన్న అపారమైన గౌరవంతోనే తప్ప, అగౌరవంతో కాదు అని అర్థం చేసుకోవాలి. భారతీయ స్త్రీ కట్టు, బొట్టు, ప్రవర్తన, సంస్కారం ప్రపంచ దేశాలకు ఇప్పటికీ, ఎప్పటికీ ఆదర్శమే.
వస్త్రధారణ (మగవారిదైనా, ఆడవారిదైనా) మన సంస్కృతిలో, వ్యక్తిత్వ వికాసంలో ప్రధాన భాగమే. సమాజానికి హాని చేసే ఏ పనైనా (అది కట్టుకునే వస్త్రాలైనా, చేసే వృత్తైనా, ప్రవర్తించే తీరైనా, మాట్లాడే భాషైనా) స్వేచ్ఛలోకి రాదు. సాంకేతికంగా ఎంత అభివృద్ధి సాధించినా మనిషి తన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. సమాజ శ్రేయస్సు కోసం సరైన రీతులో వస్త్రాలు ధరించండని చెప్పడం ఏమాత్రం తప్పు కాదు. ఒక సురక్షితమైన సమాజాన్ని నిర్మించగలిగితే అందులో మనం, మన కుటుంబం హాయిగా జీవించగలుగుతుంది. మగవారికైనా, ఆడవారికైనా విచ్చలవిడితనం తప్పు. అది సమాజాన్ని కలుషితం చేస్తుంది. కలుషితమైన సమాజంలో మన కుటుంబాలు సురక్షితంగా జీవించగలుగుతాయా? ఆలోచించండి. ఇది పాతకాలం నాటి మనస్తత్వంతో చేసే వాదనకాదు. సమాజ కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఎవ్వరూ వస్త్రధారణ చేయకూడదు. వృత్తిపరంగా ఎలాంటి వస్త్రాలు వేసుకున్నా, ప్రవృత్తి పరంగా శరీరాన్ని, సిగ్గును కాపాడే విధంగా నిండుగా వస్త్రాలు ధరించాలి. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకమైన దుస్తులు, ఉద్యోగానికి వెళ్లేటప్పుడు మరొక రకమైన దుస్తులు, గుడికి వెళ్లినప్పుడు వేరే రకమైన దుస్తులు, శుభకార్యాలకు వెళ్లేటప్పుడు ప్రత్యేకమైన దుస్తులు, అశుభకార్యాలకు వెళ్లేటప్పుడు వేరే విధమైన దుస్తులు ధరించడం సాధారణంగా చూస్తాం. దీనినే వస్త్రసంస్కృతి (డ్రెస్ కల్చర్) అంటారు. సందర్భానుసారంగా వస్త్రాలను ధరించడం అనేది మన సామాజిక సంస్కృతిలో భాగం. భావితరాల సురక్షిత భవిష్యత్తుకు అందించే రక్షణ కవచం. అందుకే వస్త్రధారణ అనేది మనిషి వ్యక్తిగత స్వేచ్ఛ కాదు -సామాజిక బాధ్యత.
ననుబోలు రాజశేఖర్, 98857 39808