న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుతున్నాయనే సంకేతాల నేపథ్యంలో వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. సోమవారం ఎంసిఎక్స్ మార్కెట్లో కిలో వెండి ధర ఒక్క రోజే రూ.21 వేలు తగ్గింది. మధ్యాహ్నం తర్వాత ఒక్క గంటలోనే కిలో వెండి ధర భారీగా తగ్గి రూ.2,33,120 కు చేరింది. ముఖ్యంగా ఉక్రెయిన్-, రష్యా యుద్ధానికి సంబంధించి సానుకూల పరిణామాలు కనిపించడంతో పెట్టుబడిదారుల్లో లాభాల స్వీకరణ కనిపించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కి మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ఉండటంతో సురక్షిత పెట్టుబడిగా భావించే వెండిపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఇటీవల వెండి కిలోకు రూ.2,54,174 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. దీని తర్వాత చోటుచేసుకున్న భారీ పతనం ఇదే కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. సోమవారం ప్రారంభంలో వెండి ధర ఔన్సుకు తొలిసారిగా 80 డాలర్లని దాటింది. అయితే లాభాల స్వీకరణ కారణంగా ధర మళ్లీ 75 డాలర్ల స్థాయికి తగ్గింది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వెండిపై పెట్టుబడిదారుల ఆసక్తి ఇంకా కొనసాగుతోంది. ఇదే సమయంలో బంగారం ధరలు కూడా ఎంసిఎక్స్‌లో ఫిబ్రవరి 2026 డెలివరీ ధర 10 గ్రాములకు రూ.1,40,230కు చేరింది. అంతర్జాతీయంగా కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు 4,536.80 డాలర్లకు చేరింది.