ఢాకా : బంగ్లాదేశ్‌లో విద్యార్థి నాయకుడు ఇంకిలాబ్ మోంచా నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వంపై ఇంకిలాబ్‌మోంచా ఆగ్రహం వ్యక్తం చేస్తూ 24 రోజుల్లోగా తమ నాలుగు డిమాండ్లు నెరవేర్చాలని అల్టిమేటమ్ జారీ చేసింది. ఈ డిమాండ్లలో ఒకటి బంగ్లాలోఉన్న భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. హాదీ హత్యతో ప్రమేయం ఉన్న ప్రతిఒక్కరిపైనా దర్యాప్తు పూర్తి చేయాలని డిమాండ్ చేసింది. హంతకునితోపాటు, హత్యకు సూత్రధారి, సహాయం చేసినవారు, వారు తప్పించుకోడానికి సహాయం చేసిన వారు, ఆశ్రయం ఇచ్చిన వారితో సహా ప్రతిఒక్కరినీ దర్యాప్తు చేసి న్యాయం ముందు నిలబెట్టాలని ఇంకిలాబ్‌మోంచా డిమాండ్ చేసింది.
32 ఏళ్ల ఉస్మాన్ హాదీపై గుర్తు తెలియని వ్యక్తులు డిసెంబర్ 12 న కాల్పులు జరిపారు. చికిత్స పొందుతూ డిసెంబర్ 18న హాదీ చనిపోయాడు. అయితే ఇంకిలాబ్ మోంచా డిమాండ్లలో భారత్ ప్రస్తావన వచ్చింది. ఢాకా మెట్రో పాలిటన్ పోలీస్ (డిఎంపి) ఎస్‌ఎన్ నజ్రూల్ ఇస్లాం ఇటీవల ఈ హత్యలో ఇద్దరు నిందితులు సరిహద్దు దాటి మేఘాలయకు పారిపోయారని ఆరోపించారు. వారికి సహకరించిన ఇద్దరు భారతీయులను కూడా అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. అయితే భారత ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న హంతకులను వెనక్కు పంపడానికి భారత్ నిరాకరిస్తే భారత్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు దాఖలు చేస్తామని ఇంకిలాబ్ మోంచా పేర్కొంది.