కారు లోయలో పడిపోయి ఇద్దరు తెలుగు యువతులు మృతి చెందిన సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగింది. వివరాలలోకి వెళితే.. తెలంగాణ లోని మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన పులఖండం మేఘనారాణి(25),ముల్కనూరుకు చెందిన భావన (24) మూడు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లారు. అయితే ఆదివారం ఉదయం మేఘన, భావన మొత్తం 8 మంది స్నేహితులు రెండు కార్లలో కాలిఫోర్నియాలో టూర్ కి వెళ్లారు. ఈ క్రమంలో అలబామా హిల్స్ రోడ్డులో మూలమలుపు వద్ద వాళ్లు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో మేఘన,భావన ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు లోయలోంచి మృతదేహాలను బయటకు తీసి పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. యువతుల మృతితో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.