పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో భూ వివాదంలో జరిగిన గొడవలో ఆది రాజయ్య (80) అనే వృద్ధ రైతు మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం మండలంలోని కనగర్తి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. మృతుడు రాజయ్య (మల్లయ్య)కు పొలం పక్కనున్న భూమి యజమాని ఆది రాజయ్య (ఐలయ్య)కు గత కొంతకాలంగా గెట్ల విషయంలో చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. పక్కనున్న కందిచేను కమిలిపోయిందని, భూమి హద్దుల విషయంలో పరస్పరం తరచూ గొడవపడేవారు. ఇదే విషయమై మృతుని కుమార్తె కూడా వాపోయింది. సోమవారం వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం పెరిగి గొడవ జరగడంతో ఈ ఘర్షణలో రాజయ్య (మల్లయ్య) పొలం బురదలో కూరుకుపోయి మృతి చెందాడు. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ప్రమాదవశాత్తు మృతి చెందాడా లేక కావాలనే హత్య చేశారనే విషయమై పోలీసులు క్లూస్ టీంతో సమగ్ర విచారణ చేపట్టారు. సంఘటనా స్థలాన్ని పెద్దపల్లి డిసిపి భూక్యా రామ్‌రెడ్డి, ఎసిపి జి.కృష్ణ పరిశీలించి, సంఘటనకు దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుమార్తె వొడ్నాల లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దీకొండ రమేష్ తెలిపారు. ఘటనాస్థలిని పరిశీలించిన వారిలో సిఐ ప్రవీణ్‌కుమార్‌తోపాటు పొత్కపల్లి, సుల్తానాబాద్, జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్ ఎస్‌ఐలు దీకొండ రమేష్, చంద్రకుమార్, సనత్‌రెడ్డి, వెంకటేశ్వర్లు ఉన్నారు.