ఉన్నావ్ అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు సోమవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది.బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సోమవారం రద్దుచేసింది. అతడిని కస్టడీ నుంచి విడుదల చేయ రాదని తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఈ కేసు చట్టపరమైన కీలక ప్రశ్నలను లేవన్త్తిందని ధర్మాసనం పేర్కొంది.సిబిఐ అధికారులు, బాధితురాలి తరుపున న్యాయవాదులు చేసిన అపీలును సోమవారం విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం, ఢిల్లీ హైకోర్టు ఆదేశాన్ని నిలిపివేస్తూ, సెంగార్ ఇప్పటికే మరో క్రిమినల్ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడని పేర్కొంది. అతడు జైలులోనే ఉంటాడని స్ఫష్టం చేసింది. విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ప్రస్తావించిన చిక్కు సమస్యలను సిజేఐ ప్రస్తావించారు. కోర్టు ఆమోదించిన అంశాలను అంగీకరిస్తే, ఒక ఎమ్మెల్యే, లేదా ఎంపీ మాదిరిగా తప్పుచేసిన ఓ కానిస్టేబుల్ లేదా పట్వారీ కూడా ప్రభుత్వ సేవకుడిగా మినహాయింపు కోరతారని ,వ్యాఖ్యానించారు.సాధారణంగా సుప్రీంకోర్టు నిందితుల వాదనలు వినకుండా,కింది కోర్టు లేదా, హైకోర్టు జారీచేసిన బెయిల్ ఆదేశాలపై స్టే విధించబోదని పేర్కొన్నారు. అయితే, ఉన్నావ్ కేసులో విచిత్రమైన వాస్తవాలు ఉన్నాయని, ఎందుకంటే, సెంగార్ మరో కేసులో ఐపిసి సెక్షన్ 304 పార్ట్ 2 కింద దోషిగా నిర్థారింపబడి శిక్ష విధింపబడి,
ఈ కేసులో కస్టడీలో ఉన్నాడని పేర్కొన్నారు.అభ్యంతరకరమైన బెయిల్ ఉత్తర్వుల అమలు నిలిపివేయాలని, హైకోర్టు ఆదేశించినట్లు సెంగర్ ను విడుదల చేయరాదని సుప్రీం ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఈ విషయంలో తన స్పందన తెలుపాలని కోరుతూ కుల్దీప్ సెంగర్ కు నోటీసు కూడా జారీ చేసింది.ఈ కేసు 2017 నాటిది.. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ తనపై ఆత్యాచారం చేసినట్లు ఓ మైనర్ బాలిక ఆరోపించింది. మొదట్లో పోలీసులు కేసు నమోదు చేయలేదు. బాధితురాలు, వారికుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆరోపణలు రావడంతో ఇది దేశవ్యాప్తంగా సంచలనం గా మారింది. 2018 ఏప్రిల్ లో బాధితురాలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసం వద్ద ఆత్మహత్యా యత్నం చేయడంతో కేసు సీరియస్ అయింది. ఫలితంగా కేసును సిబీఐకి అప్పగించారు.2018 ఆగస్టులో సుప్రీంకోర్టు జోక్యం మేరకు కేసును ఉత్తర ప్రదేశ్ లోని ట్రయిల్ కోర్టునుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. 2019 లో ఢిల్లీ కోర్టు సెంగార్ ను అత్యాచారం కేసులో దోషిగా నిర్థారించి జీవిత ఖైదు విధించింది. బాధితురాలి తండ్రి కస్టడీలో మరణించడంతో, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించినందుకు వేర్వేరు కేసుల్లో కూడా సెంగర్ ను దోషిగా నిర్థారించారు. ఈ మధ్య ఢిల్లీ హైకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేయడంతో బాధితురాలు కుటుంబసభ్యులు నిరసనలు, మీడియా లో కథనాలతో కేసు సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది.
సెంగర్ ను ఉరి తీసేవరకూ విశ్రమించనన్న బాధితురాలు
సెంగర్ జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం పట్ల బాధితురాలు సంతృప్తి వ్యక్తం చేసింది. ఏమైనా న్యాయం గెలుస్తుందని, సెంగర్ ను ఉరి తీసే వరకూ తాను విశ్రమించబోనని ఆమె సోమవారం తెలిపింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన సుప్రీం కోర్టు సెంగర్ కు నోటీసులు కూడా జారీ చేసింది. సుప్రీంకోర్టు తనకు న్యాయం చేసిందని,అయితే, అతడిని ఉరి తీసేవరకూ తాను పోరాటం చేస్తూనే ఉంటానని, అప్పుడే తనకు, కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆమె పేర్కొంది. ఇప్పటికీ తమకు బెదిరింపులు వస్తున్నాయని ఆమె వెల్లడించింది.