ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళిన లక్షలాది మంది కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎంఎల్‌సి తీన్మార్ మల్లన్న అన్నారు. సోమవారం శాసన మండలిలో ఆయన గల్ఫ్ కార్మికుల సమస్యలను లేవనెత్తారు. 202425 ఒక్క ఏడాది కాలంలోనే 1600 మంది గల్ఫ్ కార్మికులు చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయని, వారి మృత దేహాలను తెచ్చేందుకు కూడా అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తోందని అన్నారు. వారు తమ కుటుంబాలకు పంపే డబ్బుపై కూడ 18 శాతం సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, వారి కుటుంబాల సంక్షేమం, కార్మికుల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మల్లన్న అన్నారు. గల్ఫ్ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని, ప్రవాసి ఆరోగ్య పథకం ప్రవేశ పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చనిపోయిన తర్వాత ఆర్థిక సహాయం కాదు బతికి ఉండగానే వారిని ఆదుకోవాలని కోరారు.