హైదరాబాద్: నాగర్ కర్నూలు జిల్లా….కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపింది. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు దుండగులు చేపట్టారు. అక్కడే మాకాం వేసి గుప్త నిధుల కోసం తవ్వకాలు మొదలు పెట్టారు. మొలచింతలపల్లి బీటు పరిధిలోని మెదరబండ సమీపంలో దేవుని బొక్క వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ అధికారులు అర్ధరాత్రి సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుప్త నిధుల తవ్వకాలలో పాల్గొన్న దుండగులను అదుపులోకి తీసుకున్నారు. తవ్వకాలకు ఉపయోగించిన పరికరాలు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని.. సామాగ్రి కొల్లాపూర్ ఫారెస్ట్ డిపోకు తరలించారు. గ్రామస్తులు దేవుని బొక్క గుహ ప్రాంతంలో యథేచ్ఛగా తవ్వకాలు జరిగాయని ఆరోపణలు చేశారు. పురాతన రాతి విగ్రహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆవేదన చెందారు. ఇన్ని రోజులు తవ్వకాలు జరుగుతున్నా గుర్తించలేకపోయారని అధికారులను విమర్శించారు. పట్టుబడిన దుండగులను అచ్చంపేట ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసుకు తరలించారు. ఫారెస్ట్ శాఖ ఈ ఘటనపై విస్తృత విచారణ చేపట్టారు.