హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అసెంబ్లీకి వస్తున్నారని సోషల్ మీడియాలో బిఆర్‌ఎస్ శ్రేణులు భారీగా హైప్ చేశారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. కెసిఆర్ సభకు వచ్చింది ప్రజా సమస్యలు కోసం కాదని నెల జీతం పాటు ఎంఎల్‌ఎ సభ్యత్వాన్ని కాపాడుకోవడం కోసం వచ్చారని చురకలంటించారు. అసెంబ్లీ ఆవరణంలో మీడియా పాయింట్ వద్ద బీర్ల మాట్లాడారు. కెసిఆర్ రెండు నిమిషాలు కూడా సభలో ఉండకుండానే వెళ్లిపోయరని, దళితుల పట్ల కెసిఆర్‌కు ఉన్న వివక్ష ఇప్పుడు అర్థం అవుతోందన్నారు. దళిత స్పీకర్‌ను అధ్యక్షా అనే సంబోధించాల్సి వస్తుందనే భయంతోనే కెసిఆర్ పారిపోయారని బీర్ల ఎద్దేవా చేశారు. దళితులపై కెసిఆర్‌కు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అర్థం అవుతుందన్నారు. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండి కేవలం ఫార్మాలటీ కోసం బాధ్యతరాహిత్యం సూచిస్తుందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన విషయం తెలిసిందే. సభలో మూడు నిమిషాలు ఉండి వెళ్లిపోయారు. శాసన సభలో కెసిఆర్‌కు సిఎం రేవంత్ కరచాలనం చేసిన విషయం విధితమే.