భాక్రానంగల్ తెలంగాణలో ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. దేవాదుల ఏ బేసిన్ లో ఉందో తెలియని సిఎం మనకు ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు- రంగారెడ్డిని వ్యతిరేకిస్తూ లేఖ రాసిన అధికారి సలహాదారుగా ఉన్నారని, నీటి పారుదలశాఖపై చర్చకు మాజీ సిఎం కెసిఆర్ రావాలని అంటున్నారని తెలియజేశారు. సబ్జెక్టు లేనిది ఏం మాట్లాడుతారని కెటిఆర్ ప్రశ్నించారు. చెక్ డ్యాం పేల్చిన వారిపై చర్చలు తీసుకోవాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడిగారని, మేడిగడ్డను, ఇసుక కోసం చెక్ డ్యాంలు పేల్చేశారని మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ ను మూడుగా విభజిస్తారని, అందుకే ఫ్యూచర్ సిటీని ఫోర్త్ సిటీ అని అంటున్నారని ఎద్దేవా చేశారు. వార్డుల విభజన పూర్తి అశాస్త్రీయంగా ఉందని, ఎపి చంద్రబాబు నాయుడుకు కోపం వస్తుందని పాలమూరు- రంగారెడ్డి పనులు చేయట్లేదని అన్నారు.
కాల్వల కోసం పిలిచిన టెండర్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందని, గోదావరి నీటి హక్కుల కోసమే కాళేశ్వరం అదనపు టిఎంసి పనులు కెసిఆర్ చేపట్టారని పేర్కొన్నారు. పాలమూరు- రంగారెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి రంధ్రాన్వేషణ వల్ల రాష్ట్రానికి నష్టం అని అన్నారు. అనుమతులు దృష్టిలో ఉంచుకొని తాగునీటి పేరుతో పనులు చేశామని, కెసిఆర్ చిత్తశుద్ధి కాళేశ్వరం విషయంలో చూడాలని అన్నారు. పోలవరం, కాళేశ్వరం పోలిస్తే అన్నీ అర్థం అవుతాయని, జీవితాశయం సాధించిన సిఎం రేవంత్ రెడ్డికి కోపం, ఉక్రోషం ఎందుకు అని కెటిఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి దోపిడీని అడుగడుగునా అడ్డుకుంటున్నందుకే దూషిస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి తనకు దీవెనలని..తనను తిడితే పడతాను కానీ కెసిఆర్ ను అంటే ఊరుకోనని కెటిఆర్ హెచ్చరించారు.