ఆకాశం నుండి చుక్కలను తీసివేస్తే
మిగిలేది శూన్యం
మనిషి నుండి మానవత్వాన్ని తీసివేస్తే
శేషం అమానుషం
అన్ని దుఃఖాలను ఒక్క క్షణంలో
కేంద్రీకృతం చేస్తూ
వచ్చేస్తుంది తీవ్ర వ్యాధి
కాలానికి ముందస్తు
సమాచారం ఇవ్వకుండానే
దాడి చేస్తుంది మృత్యువు
విషాద గాధల మనిషికి ఎన్ని బాధలు
ఇప్పుడు ఇదిగో మానవ బాంబు పేలుడు
అయినా ప్రవేశద్వారం దగ్గర
సాటి మనిషి కోసం
ప్రాణాలనైనా ఇవ్వడానికి
సిద్ధంగా ఉంటుంది మానవత
అది మడమ తిప్పదు, మాట తప్పదు
ఉగ్ర భూతము ఒక కృత్రిమ
మృత్యు దేవత శాంతికి శత్రువు
చిన్ని, చిన్ని స్వేచ్ఛల కోసం
పెద్ద, పెద్ద త్యాగాలు చేసే
బడుగు జీవుల మీద
పిడుగుపాటు ఈ బాంబు
రాలిపోతామని తెలిసే విరిసే
అమాయకపు పూలు
మానవతా పరిమళాలను
వాగ్దానం చేస్తున్నప్పుడు
పసిపాపలు అమాయకపు కేరింతలతో
నవ్వుల ప్రపంచాలను
అలవోకగా పంచుతున్నప్పుడు
పరుల కష్టాలకు కరిగి
పొరుగు దుఃఖాలకు పొగిలి
గుండెలకు హత్తుకోలేమా?
మాజీ మనిషిని మన మనిషిగా
మార్చుకోలేమా?
– అమ్మంగి వేణుగోపాల్