‘లేఖమాల’ ఉత్తరాల మాల. ఇది సంజీవదేవ్ హరిహర ప్రియకు రాసిన ఉత్తరాలు. అయి తే ఉత్తరాలు రాసుకుంటే అందులో విశేషమేముం ది? అనుకోవచ్చు కానీ కొన్ని ఉత్తరాలు చరిత్రను, సమాజ గమనాన్ని, మానవ స్వభావాలను పట్టిస్తాయి. తెలుగులో లేఖలకు సాహిత్య గౌరవాన్ని తెచ్చిన వాళ్ళలో చలంతో పాటు సంజీవ్ దేవ్ కూడా నిలుస్తారు. లేఖా సాహిత్యంలో వారి ఈ దశను 1950 నుంచి 2000గా చెప్పవచ్చు. సంజీవదేవ్ స్వయం కృషి తో సంస్కృతం, ఇంగీష్, ఫ్రెంచి, బెంగాలి, ఉర్దూ, హిందీ భాషలలో మంచి పాండిత్యాన్ని గడించారు. లేఖలతో పాటు తన చిత్రలేఖనాన్ని కూడా జతచేసి పంపేవారు. వీరు లేఖకులే కాదు చిత్రలేఖకులు కూడా. ‘సాహిత్య లేఖలో కేవలం సాహిత్యాంశాలే కాకుండా కొన్ని వైయక్తికాంశాలు ఉం డాలనీ, లేకపోతే అది సాహిత్య వ్యాసం అవుతుందని సంజీవదేవ్ అభిప్రాయం.
హరిహరప్రియ పేరుతో ఉన్న ఈ లేఖలు సాతవల్లి వేంకట విశ్వనాథ భట్టకు సంజీవదేవ్ గారు రాసినవి. హరిహరప్రియ ఈ లేఖలకి ముందుమాట రాస్తూ, ముప్పయి మూడేండ్లుగా ఎదురు చూసి, చూసి 2017లో ఈ లేఖలను చివరికి ముద్రించినట్లుగా చెప్పారు. తంగిరాల వెంకట సుబ్బారావు, బెజవాడ శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు గార్ల సహకారం వల్ల ఈ పుస్తకం వెలుగు చూసిందని చెప్పుకున్నారు. తంగిరాల వేంకట సుబ్బారావు ముందుమాట రాస్తూ, ముఖ్యం గా లేఖా సాహిత్యంలో చలం, సం జీవదేవ్‌లు మాత్రమే ఒక ప్రత్యేకతను సాధించారని, సాహిత్య గౌరవమే కాక లేఖకు కళాత్మకత, జీవన తాత్త్వికతలను కూడా తీసుకువ చ్చారని, స్వయంకృషితో నేర్చుకున్న భాషా పాండిత్యంతో పాటు, ఆయన చిత్రకారులని, ఎంతో మంది మిత్రులకు, బంధువులకు వీరు రాసిన లేఖలు అపురూపమైనవని అంటరు.
ఈ లేఖల్లో వ్యక్తిగతమైన విషయాలు, సాహిత్యపరమైన విషయాలు, తాత్వికపరమైన విషయాలు, ప్రకృతి చుట్టూ సమాజం, కళలు, సాంఘిక సమస్యలు దేశ పరిస్థితులు వంటి ఎన్నో అంశాలు ప్ర స్తావించారు. నిజానికి లేఖా సాహిత్యం లేదా లేఖ లు లేదా ఉత్తరాలు మూడు రకాలుగా ఉంటాయి. అధికారిక లేఖలు, వ్యక్తిగత బాగోగులకు సంబంధించిన లేఖలు, సాహిత్యాంశాలను జోడిస్తూ వ్యక్తిగతమైన విషయాలను కలుపుతూ రాసిన లేఖలు అయితే సంజీవదేవ్ లేఖలు. సమాజ గమనం, వ్యక్తిగతం, సాహిత్యం కలగలిపిన లేఖలుగా చెప్పవచ్చు.
‘రసరేఖలు‘ అని చిత్రకారుల గురించి రాసిన పుస్తకం ప్రతి తనదగ్గర ఒక్క కాపీ కూడా లేదని హరిహరప్రియకు చెప్పారు అయన. ఆ పుస్తకాన్ని మీకు ఏదో విధంగా అందచేస్తానని అంటూ దాదాపు 75 ప్రాంతంలో రాసిన లేఖ ఇది. హరిహరప్రియ ఒక పుస్తకా న్ని అచ్చువేస్తునట్టు ఆ పుస్తకానికి ‘ప్రాక్పశ్చి మ చిత్రకారులు’ అనే పేరును సూచిస్తున్నట్టు తెలపడమే కాక ఆ ముఖచిత్రాన్ని కూడా వారే వేసారు. తరువాత ఇంకా ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. ఆ పుస్తకావిష్కరణకు సంజీవదేవ్‌ని రమ్మని హరిహరప్రియ ఆహ్వానించారు. అయితే ఆ ఆహ్వానాన్ని మన్నిస్తూనే, ఒక మాట స్పష్టంగా చెబుతా రు. ఏ కారణం చేతనైనా ఆవిష్కరణ సభ అవస రం లేదని అభిప్రాయపడ్డా ఫర్వాలేదు. మీ సౌకర్యాన్ని బట్టి నిర్వహించుకోండి. ఇక మరొక ముఖ్య విషయం నా బయోడేటా అవసరం లేదు. నా పుట్టిన తేదీలు, చదువులు, పొందిన గౌరవాలు రాయవలసిన అవసరం లేదు. సంజీవదేవ్ అంటే ఏమిటి అని పాఠకులకు తెలిస్తే చాలు. నా జీవిత చరిత్ర అవసరం లేదు. అని చాలా నిష్కర్షగా, నిజాయితీగా చెప్పారు.
హరిహరప్రియ అనువాదాలను మెచ్చుకుంటూ అనువాదాలకు ఉండవలసిన ఒక ముఖ్యాంశాన్ని వివరిస్తారు. “అనువాదాలు అనువాదాల వలె కా క మాతృకల వలెనే ఉండటం మీ వ్యక్తిగత నైపు ణ్యం” అనువాదాలు మాతృకల వలె ఉండటం అనేది అత్యవసరం. ఇప్పటికీ అనువాదకులు అనుసరించవలసిన మార్గాన్ని ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా జూలై తొమ్మిది 80లో రాసిన లేఖలో “కన్నడ తెలుగు సాహిత్య వినిమయ” అనే పుస్తకాన్ని హరిహరప్రియ పంపించినట్లు దానికి సమాధానంగా ఈ పుస్తకం ద్వారా కన్నడులు తెలుగు సాహిత్యాన్ని గురించి, తెలుగువారు కన్నడ సాహిత్యాన్ని గురించీ విపులంగా తెలుసుకునే అవకాశం ఉందని, ఇట్లా పుస్తకాల వల్ల గొప్ప ఆశయం నెరవేరుతుందని రాస్తారు.
మరొక ఉత్తరంలో సంజీవదేవ్‌కి అప్పటికే ఆంధ్ర యూనివర్సిటీ వారు కళా ప్రపూర్ణ బహుకరించినట్టు అయితే దాన్ని వారు తిరస్కరించినట్టు తెలుస్తుంది. దాన్ని స్వీకరించడం వల్ల దాని విలువ పోతుంది. అనే భావనతో తిరస్కరించానని తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. అప్పుడు జరిగిన సంఘటనలు, కారణాలు ఈ ఉత్తరాల వలన మనం పూర్తిగా గ్రహించలేకపోయినా ఒక వాస్తవ చరిత్ర లేఖ ద్వారా రేఖా మాత్రంగా తెలుస్తుంది. అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయమేమటంటే హరిహరప్రియ చాలా సూటిగా సంజీవదేవ్‌ను మీరు ‘కళాప్రపూర్ణ’ తిరస్కరించారు. మరి సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వాన్ని ఎందుకు ఒప్పుకున్నారు అని అడిగినప్పుడు, అతను దానికి కూడా జవాబు ఇచ్చాడు. ఒక గొప్ప సాహితీ వేత్తగా, నిజాయితీగా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెబుతాడు. సాహిత్య అకాడమీ తాను ఇస్తున్న విశిష్ట సభ్యత్వాన్ని దుర్వినియోగపరచడం లేదని నేను సమ్ముతున్నాను కాబట్టి స్వీకరిస్తున్నాను అని చెప్పారు. కళాప్రపూర్ణను తిరస్కరించడానికి కారణాలను కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. కళాప్రపూర్ణకు సరైన గౌరవం దక్కలేదని ఆయన అభిప్రాయం. ఇద్దరి మధ్య ఒక పారదర్శకమైన సంభాషణను జరుగుతుంది.
డిసెంబరు 18, 82లో రాసిన లేఖలో ఆంధ్ర యూనిర్సిటీలో తన ఉపన్యాస పరంపర పూర్తి అయినాక తనకు డి.లిట్ గౌరవ డాక్టరేట్ పట్టాతో గౌరవించారని కూడా పేర్కొన్నారు. ఉపన్యాస పరంపరను ఉపన్యాసాల మాలగా పేర్కొనడం నూతనంగా ఉంది. 79లో రాసిన ఒక లేఖలోనే కాదు మరికొన్ని లేఖల్లో కూడా ప్రత్యేకంగా తెలంగాణ అని వాడారు. తెలంగాణలోని ఖమ్మం అంటూ ప్రత్యేకంగా పేర్కొనడం గమనించాల్సిన విషయం. ఇంకొక మంచి విషయాన్ని సంజీవదేవ్ ప్రస్తావించారు. హరిహరప్రియకు రాస్తున్న లేఖలో “కొత్తగా పత్రికలలో ఏమీ రాయటంలేదు. పత్రికలలో సంవత్సరాల కొలదీ రాసి, రాసి పాతదనం వచ్చింది. ఆ పాతదనం అంతరించేంత వరకు ఏమి రాయకుండా ఉంటేనే బాగుంటుంది”. ఈ మాటతో ఆయన రచయితగా తన గురించి కూడా తాను చెప్పుకున్నట్టుగా అనిపిస్తుంది. ఒక రచనకు, రచయితకు నూతనత్వం ఎప్పుడూ ఉండాలని ఆయన కోరిక. పరిశోధన లాంటి ఈ గ్రంథాన్ని పరిశోధకులు కొనాల్సిందే. తెలుగు పాఠకులు నవలా సాహిత్యం తప్ప పరిశోధన పట్ల దృష్టి పెట్టట్లేదు అని ఆయన ఆవేదన చెందుతాడు. బహుశా 80ల నాడు ఈ మాట అన్నా, ఇప్పటికీ తేడా లేదేమో నిజానికి.
ఈ లేఖమాలలో సంజీవదేవ్ 74నుండి 89వరకు హరిహరప్రియకు రాసిన 95 లేఖలు ఉన్నాయి. ఆ 95 లేఖల్లోని సారాంశం ఒక సాహిత్యకారుడు, చిత్రకారుడు, ఉపన్యాసకుడు అయిన సంజీవదేవ్ తన ఊరైన తుమ్మలపూడి ప్రాంతాన్ని, ఆ ప్రాంతపు పంటలు, రైతుల పరిస్థితిని అప్పటి ప్రకృతి, ప్రళయాలను, తన సాహిత్య పిపాసను, తనకు హరిహరప్రియతో ఉన్న ఆత్మీయ సంబంధాన్ని, తన పర్యటనలను తన సాహిత్య ప్రపంచాన్ని ఒక్కటేమిటి సమస్తాంశాలను ఈ లేఖల ద్వారా పాఠక లోకానికి అందించారు. 2017 లో ముద్రితమైన ఈ పుస్తకం ప్రచురణ పుస్తకమనే అనే కన్నడ పదానికి పుస్తకాల ‘ఇల్లు‘ అని తెలుగులో చెప్పుకోవాలి. ఆ పుస్తకాల ఇల్లు నుంచి ప్రచురించిన ఈ పుస్తకాన్ని పాఠలోకానికి మరొకసారి పరిచయం చేయడమే ఈ వ్యాస ఉద్దేశ్యం.
– ఆచార్య ఎన్.రజని