డిసెంబర్ 19 నుండి 21 వరకు ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో జరిగిన హైదరాబాద్ ఇంటర్నేషనల్ షా ర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్(HISFF), లఘు చిత్రాలకు పెరుగుతున్న ప్రాధాన్యతను చాటి చెప్పింది. సంస్కృతి, పర్యావరణం, ఎత్నిసిటీని ప్రతిబింబించే సమకాలీన కథలు, కథనాలు, కథావిశ్లేషణలకు వేదికగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఇదే. మొదటి ఎడిషన్ అ యినప్పటికీ, ఇరాన్, ఇరాక్, స్పెయిన్, ఈజిప్ట్, యుఎస్‌ఏ, యూకే, యూఏఈ, శ్రీలంక, నెదర్లాం డ్స్, సౌత్ కొరియా లాంటి దేశాల నుం చి 705 ఎంట్రీలు వచ్చాయి. 25 సభ్యు ల జ్యూరీ, వీటిలోంచి 60 షార్ట్ ఫిల్మ్‌ల ను అధికారిక ఎంట్రీలుగా ఎంపిక చేసిం ది. ఆపై, ఐదుగురు సభ్యుల ప్రధాన జ్యూరీ 11 విజేతలను ప్రకటించింది. ప్రధాన జ్యూరీలో ప్రముఖ విమర్శకురాలు -రచయిత్రి మైథిలి రావ్, ప్రఖ్యాత నటుడు- దర్శకుడు నాజర్, దర్శకుడు- స్క్రీన్ రైటర్ నగేష్ కుకునూర్, అస్సామీ దర్శకుడు ఉత్పల్ బోర్పుజారి, డాక్యుమెంటరీ దర్శకురాలు- కంటెంట్ స్ట్రాటజిస్ట్ ఆర్తి శ్రీవాస్తవ ఉన్నారు.
ఇరాన్‌కి చెందిన ‘సర్న్‌మేష్ట్ట్’కి మొదటి బహుమతి, మణిపురీ సినిమా ‘టాయ్ గన్’కి రెండవ బహుమతి, ‘మై ఫాదర్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ వాటర్’ అనే భారతీయ చిత్రానికి మూడవ బహుమతి లభించాయి. ఇరాన్‌కి చెందిన ‘ద విజిల్’, భారతదేశానికి చెందిన ‘నింగ్మా’కు స్పెషల్ జ్యూరీ అవార్డులు దక్కాయి. భరత్ దువ్వాడ దర్శకత్వం వహించిన ‘ఎ నైట్ ఆన్ ద ఫుట్పాత్’కి PSFS ప్రామిసింగ్ తెలుగు ఫిల్మ్ అవార్డు అందజేశారు. ఇది, మనుగడ కోసం వేశ్యావృత్తిని ఎంచుకున్న ఒక ట్రాన్స్ మహి ళ పోరాటాన్ని చిత్రీకరించిన ఏకైక LGBTQIA+ చిత్రం.
ఇవి కాకుండా, ఐదు చిత్రాలకు సర్టిఫికేట్స్ ఆఫ్ మెరిట్ అందజేశారు. ప్రపంచ సినిమా-స్థానిక సంస్కృతులు సమకాలీన చిత్ర నిర్మాణంలో సవాళ్ళు
HISFFలో, సమకాలీన సినిమాలోని వివిధ అంశాలపై రెండు రోజుల పాటు విస్తృత చర్చలు జరిగా యి. వీటిలో, ప్రధాన జ్యూరీతో పాటు కెనడియన్ ఫిలిం విమర్శకురాలు జూడీ గ్లాడ్‌స్టోన్, నటి లీమా దాస్, మణిపురీ దర్శకుడు సుంజు బాచస్పతిమయుమ్, ఇంకా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కమర్షియల్ సినిమా తరచూ మహిళల్ని అంగడి బొమ్మల్లా చూపిస్తోందని, ప్రత్యామ్నాయ సినిమాలో మాత్రం వారే కేంద్ర బిందువుగా ఉంటారని మైథిలి రావ్ గమనించారు. యువతలో ఈ దృక్పథాన్ని పెంపొందించడానికి, స్కూల్, కాలేజీ స్థాయిలోని వారిని ఫిలిం సొసైటీలలో భాగస్వాములను చేయడం అవసరమన్నారు.
ప్రస్తుతం ప్రేక్షకుల మధ్య పెరిగిన అంతరాల దృష్ట్యా, ఏ వర్గం కోసం సినిమా తీస్తున్నామో ముందుగానే నిర్ణయించుకోవడం మేలని యువ దర్శకులకు నగేష్ కుకునూర్ సూచించారు. అస్సామీ దర్శకుడు ఉత్పల్ బోర్పుజారి ‘మొబైల్ థియేటర్’ వ్యవస్థ గురించి చెప్పారు. “ఈశాన్య భారతంలో అరకొరగా మాత్రమే సినిమా హాళ్ళు ఉండడంతో, దర్శక నిర్మాతలు, నటులూ కలిసి గ్రామ గ్రామాలకూ వెళ్ళి మరీ మా సినిమాలను మార్కెట్ చేసుకుంటుంటాం” అని అయన అన్నారు. నటి లీమా దాస్, ప్రత్యామ్నాయ సినిమా, షార్ట్ ఫిల్మ్‌లను ప్రోత్సహించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు కోరారు. ప్రపంచ ప్రేక్షకులు ప్రామాణికతను, స్థానిక సంస్కృతులను గౌరవిస్తారని సుంజు బాచస్పతిమయుమ్, ఫిలిం సొసైటీ ప్రతినిధులు అలెగ్జాండర్ లియోపౌ, క్రిస్టొఫర్ డాల్టన్, బాలాజీ ఐకా తెలిపారు.
సాంకేతికతను ఎవరైనా ఉపయోగించవచ్చు కానీ, ప్రభావవంతమైన కంటెంట్ సృష్టించడమే నిజమైన సవాలు అని నాజర్ అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధస్సు (AI)పై పెరుగుతున్నఆందోళనల గురించి మాట్లాడుతూ, అది మానవ భావోద్వేగాన్ని పునరావృతం చేయలేదని గమనించామన్నారు. చెన్నయ్ ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజానికి చెందిన శశి కుమార్, సెన్సార్షిప్, సృజనాత్మక స్వేచ్ఛపై పెరుగుతున్న అసహనం గురించి వివరించారు. కేరళ ఫిల్మ్ ఫెస్టివల్‌లో, ‘బ్యాటిల్‌షిప్ పోటెమ్కిన్’, ‘బీఫ్’తో సహా 19 చిత్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉదహరించారు. సోషల్ మీడియా రాక సినిమాను ఎలా ప్రభావితం చేసిందో ఆర్తి శ్రీవాస్తవ చెప్పారు. ఇప్పుడు ‘సినిమా’ అనే పదం ‘కంటెంట్’గా మారింది. కంటెంట్ సృష్టిస్తే చాలదు, అది స్ట్రాటజిక్‌గా డిజైన్ చేయాలి. కానీ, అర్థవంతమైన కంటెంట్‌కే ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.
HISFF గురించి ఈ మూడు రోజుల అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TSFDC), తెలంగాణ ప్రభుత్వ సంస్కృతి, యువజన, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గౌరవ అతిథిగా విచ్చేశారు. TSFDC ఛైర్‌మెన్ దిల్ రాజు అధ్యక్షత వహించారు. ప్రముఖ దర్శకుడు, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు జ్యూరీ కమిటీ సభ్యుడు ఉమా మహేశ్వరరావు, HISFF నిర్వాహక కమిటీ ప్యాట్రన్‌గా పనిచేశారు. ‘అన్సెస్సోవ్’, ‘జహాన్- ది లాస్ట్ గిఫ్ట్’ లఘు చిత్రాల స్క్రీనింగ్‌తో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈశాన్య భారతదేశంలోని ప్రతిభను ప్రదర్శించడానికి ఏర్పాటు చేసిన ‘నార్త్ ఈస్ట్ పెవిలియన్’లో, 11 షార్ట్ ఫిల్మ్‌లు స్క్రీన్ చేశారు. అలాగే, ‘రెట్రోస్పెక్టివ్ స్క్రీనింగ్స్’లో భాగంగా, ఐదు క్లాసిక్ చిత్రాలు ప్రదర్శించారు.
ఇదిలా ఉంటే, ఇరాన్‌కి చెందిన చిత్రాలలో, అవార్డులు గెలిచిన వాటితో పాటు, ‘షాప్ కీపర్’, ‘ఎలివింగ్’, ‘మీడియం క్లోజ ప్’, ‘డార్క్ డాన్స్’కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఒక పక్క కమర్షియల్ సినిమాలో రోజు రోజుకూ దిగజారుతున్న విలువల పట్ల ప్రేక్షకుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంటే, మరోపక్క సృజనాత్మకత స్వేచ్ఛపై ఆంక్షలు విధించబడుతున్నాయి. ఈ సమయంలో, ప్రత్యామ్నాయ సినిమాకి ప్రాచుర్యం మరింత పెరుగుతోందనడానికి HISFF ఒక నిదర్శనం. ఈ నేపథ్యంలో, వీటి మనుగడకి ఇలాంటి చిత్రోత్సవాలు చాలా కీలకం. అందులోనూ, ‘విజన్ డాక్యుమెంట్2047’లో పేర్కొన్నట్లుగా, ప్రపంచ సినిమా పటంలో తెలంగాణ సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవాలంటే, విభిన్న స్వరాలు- దృక్పథాలను ప్రోత్సహించడం, వాటికి మద్దతునివ్వడం మన ప్రభుత్వ బాధ్యత. మనందరి బాధ్యత కూడా.
– కృష్ణ జ్యోతి