ముంబై: టీమిండియా ప్రధాన కోచ్‌గా కొనసాగుతున్న గౌతం గంభీర్‌ను టెస్టు ఫార్మాట్ నుంచి తప్పిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీంతో గంభీర్‌ను టెస్టుల నుంచి తప్పించి మాజీ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్‌కు ఈ బాధ్యతలు అప్పగించేందుకు బిసిసిఐ సిద్ధమైనట్టు వార్తలు గుప్పుమన్నాయి.
అయితే ఈ కథనాలను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా ఖండించారు. కొందరు కావాలనే ఇటువంటి అర్థంపర్థంలేని కథనాలను సృష్టిస్తున్నారని విమర్శించారు. గంభీర్‌ను తప్పించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గంభీర్ కాంట్రాక్ట్ 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు ఉందని, అప్పటి వరకు అతనే మూడు ఫార్మాట్‌లలో ప్రధాన కోచ్‌గా కొనసాగుతాడని సైకియా వివరించారు.