న్యూఢిల్లీ: దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ సైనిక బలగాల సర్వాధిపతి , రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆదివారం నౌకాదళ జలాంతర్గామిలో ప్రయాణించారు. పశ్చిమ తీరంలోని కార్వార్ నౌకాదళ స్థావరం నుంచి యుద్ధక్షేత్ర జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్ లో ఆమె సాహస విన్యాసం సాగింది. ఆమె వెంట నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠీ కూడా ఉన్నారు. కర్నాటకలోని ఈ నౌకా స్థావరంలో రాష్ట్రపతి ప్రయాణం సాగిన విషయాన్ని అధికారులు తెలిపారు. 2006 ఫిబ్రవరిలో అప్పటి రాష్ట్రపతి హోదాలో అబ్దుల్ కలాం కాల్వరి శ్రేణి జలాంతర్గామిలోనే ప్రయాణించి, నౌకాదళానికి ఉత్తేజం కల్పించారు. ఇప్పటి రాష్ట్రపతి ముర్మూ జలాంతర్గామిలో ప్రయాణించడం ఇదే తొలిసారి. నేవీ దుస్తులలో అంతకు ముందు డెక్‌లో నౌకాదళాథికారులతో కలిసి దిగిన ఫోటోలను రాష్ట్రపతి సచివాలయం మీడియాకు పంపించింది.
ఈ ఏడాది జనవరిలోనే ఈ అత్యంత సమర్థవంతమైన సబ్ మెరైన్ నేవీలో సేవలకు చేరింది. పి 75 ప్కోరిపిన్ ప్రాజెక్టులో వాఘ్‌షీర్ ఆరవ, చివరి సబ్‌మెరైన్‌గా నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత బలోపేత డిజిల్, ఎలక్ట్రిక్ సబ్ మెరైన్‌లలో వాఘ్‌షీర్ ఒకటిగా పేరొందింది. శత్రు సేనలను పసికట్టడం, దెబ్బతీయడంతో అత్యంత చాకచక్యంగా ఉంటూ, భారతీయ నౌకాదళానికి ఇది రక్షణ కవచంగా పేరు తెచ్చుకుంది, పలు సాహస విన్యాసాలతో పాటు సేవా కార్యక్రమాలకు కూడా అనువైన సాధనా సంపత్తిని సంతరించుకుంది.
ఎప్పటికప్పుడు శత్రు కదలికల సేకరణ, నిశిత పర్యవేక్షణ, ప్రత్యేక చర్యలకు పెట్టింది పేరుగా ఉంది. యాంటి మిస్సైల్స్, కీలక శ్రేణి టోర్పిడోలు, సోనార్ వ్యవస్థలతో ప్రపంచ స్థాయి సబ్ మెరైన్‌గా మారిందిహిందూ మహాసముద్ర ప్రాంతంలో కాల్వర్ నౌకా స్థావరాన్ని భారతీయ నౌకాదళం దీర్ఘకాలిక భద్రతా వ్యూహాలతో రూపొందించింది, తీర రక్షణకు వెన్నుదన్నుగా ఉన్న ఈ ప్రాంతం నుంచి బలోపేత సబ్ మెరైన్‌లో రాష్ట్రపతి ప్రయాణించడం కీలక అంశం అయింది.