చెన్నై: తాను ఇక సినిమాలలో నటించబోనని, తనకు అన్ని అందించిన సినిమాకు ఇక సెలవు చెపుతున్నానని హీరో, రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ప్రకటించారు. తాను సినిమాల్లోకి ఎంతో కష్టపడి వచ్చానని, ఇక్కడ కొద్ది పాత్రతో అయినా స్థిరపడాలని కోరుకున్నానని, అయితే ఇప్పుడు తనకు ఫ్యాన్స్ అన్ని ఇచ్చారని వారి కోసం ఇప్పుడు తాను పాటుపడాల్సి ఉంది. తనను నిలబెట్టిన వారి కోసం తాను మరో 30 ఏండ్లు సేవలను నేరుగా అందించాల్సి ఉందని చెప్పారు. అందుకే పూర్తి కాలం వారి కోసం పాటు పడేందుకు సినిమాలకు రిటైర్మెంట్ చెపుతున్నానని విజయ్ ప్రకటించారు. విజయ్ నటించిన జన నాయగన్ ఆడియో ఆవిష్కరణ సభ సింగపూర్‌లో జరిగిన దశలో విజయ్ భావోద్వేగంతో మాట్లాడుతూ ఇదే తన చివరి సినిమా ఇక సినిమాలకు గుడ్ బై అని తెలిపారు. సినిమాకు వచ్చి తాను ముందుగా ఓ ఇల్లు కట్టుకోవాలని ఆశించానని, అయితే ఫ్యాన్స్ మద్దతుతో తాను ఇప్పుడు ఏకంగా కోట వంటి భవనం అందేలా చేశారని చెప్పారు.
ఇకపై తాను మరో కోట వంటి రాజకీయ భవనంలోకి చేరుకునేలా చేస్తారని ఆశిస్తున్నానని ఫ్యాన్స్ కేరింతల నడుమ తెలిపారు. కౌలాలంపూర్‌లోని బుకిత్ జైలు స్టేడియంలో ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. దీనికి దాదాపు లక్ష మంది విజయ్ అభిమానులు తరలివచ్చారు. ఆడియో లాంఛ్ కార్యక్రమంలో ఇంత భారీ జనం పాల్గొన్న తొలి వేడుకగా ఇది ఇప్పుడు మలేసియా బుక్ ఆఫ్ రికార్డులలో నిలిచింది. మలేసియాలో తమిళ సంతతి వారు అత్యధికంగా ఉంటారు. శ్రీలంక తరువాత సింగపూర్ ఇతర ప్రాంతాల్లోనే తరాలుగా తమిళులు నివసిస్తున్నారు.
ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు చెప్పిన విజయ్ వారితో జీవితంలో రాణించాలంటే , స్నేహితులుంటే చాలు అనుకోరాదు, గట్టి శత్రువు అవసరం. ఎదుటి పక్షం బలీయంగా ఉంటే, సవాళ్లు ముందు నిలిస్తేనే ఎవరైనా బలం పుంజుకుంటారు. శత్రువును దాటేస్తూ మనం ముందుకు వెళ్లితీరుతామని విజయ్ చెప్పారు. ఇక వచ్చే ఏడాది 2026లో చరిత్ర తిరగరాయబోతున్నామని, దీనిని స్వాగతించేందుకు సిద్ధంగా ఉందామని పిలుపు నిచ్చిన విజయ్ థ్యాంక్ యూ మలేసియాతో తన ప్రసంగం ముగించారు, ఆడియో విడుదల కార్యక్రమం అపూర్వ రీతిలో, ఆర్బాటంగా ఐదారు గంటలు సాగింది. రాజకీయ రంగ ప్రవేశానికి ముందు సినిమాకు వీడ్కోలు ఉత్కంఠభరితంగా , సినీ తళుకులతో మెరిసింది.