పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ డిపిఆర్ వాపస్ వచ్చిందా.. లేదా..?
ప్రభుత్వం సమాధానం చెప్పాలి
అసెంబ్లీలోప్రభుత్వం పిపిటి ఇస్తే.. మాకు కూడా పిపిటికి అవకాశం ఇవ్వాలి
మాజీమంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో 90 టిఎంసిల నుంచి 45 టిఎంసిలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తగ్గించిందని మాజీమంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు నిలదీశారు. 45 టిఎంసిలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ రాశారా.. లేదా..? సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. 45 టిఎంసిలతో మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఏ జిల్లాకు అన్యాయం చేస్తారని ప్రశ్నించారు. 45 టిఎంసిలతో ఏ జిల్లాను ఎండబెడతారు..? అని నిలదీశారు. ప్రభుత్వం డిఫెన్స్‌లో పడినప్పుడు అసెంబ్లీ పెట్టి బిఆర్‌ఎస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కృష్ణానది ప్రాజెక్టులను కె.ఆర్.ఎం.బికి అప్పగిస్తే కెసిఆర్ పోరాటం చేశారని, దాంతో అప్పుడు అసెంబ్లీలో లెంపలు వేసుకుని నిర్ణయాన్ని వాపస్ తీసుకుని తీర్మానం చేశారని గుర్తు చేశారు.
పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ డిపిఆర్ వాపస్ వచ్చిందా.. లేదా..? చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ డిపిఆర్ ఎందుకు తిరిగి సమర్పించలేదని నిలదీశారు. బిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో ఆదివారం మాజీ మంత్రి హరీష్‌రావు మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. సభలో ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన సమయం ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా సభ సంప్రదాయాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. తమకంటే మూడోవంతు సభ్యులు ఉన్న పార్టీలకు ఇద్దరికి అవకాశం ఇస్తే, తమ పార్టీకి ఒక సభ్యుడితే మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నారని పేర్కొన్నారు. గత అసెంబ్లీ సమావేశాలో ఘోష్ కమిషన్ రిపోర్టుపై తాను మాట్లాడుతుంటే ఏడుగురు మంత్రులు అడ్డుపడ్డారని అసహనం వ్యక్తం చేశారు. ఈసారి అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా, తాము మాట్లాడుతుంటే మంత్రులు అడ్డుపడకుండా స్పీకర్ తమకు అవకాశం కల్పించాలని కోరారు.
ఏ అంశంపైన చర్చ పెట్టినా మేము సిద్దంగా ఉన్నాం
కాంగ్రెస్ హామీలు, ఎరువుల కొరత, రైతుబంధుపై చర్చ జరగాలని సూచించారు. దేవుడుపై ప్రమాణం చేసి రుణమాఫీ ఎగ్గొట్టిన దానిపై చర్చ జరపాలని అన్నారు. హిల్ట్ పి, ట్రిపుల్ ఆర్, గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మరణాలపై చర్చ, జాబ్ క్యాలెండర్‌పై జరగాలని సూచించారు. సిఎం రేవంత్ రెడ్డికి ఫుట్ బాల్ సోకులు తీర్చుకుంటే, కోఠి, కొండాపూర్ ఆస్పత్రుల్లో గురుకుల పాఠశాలల విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో చేరిన అంశంపై చర్చ జరగాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల డి.ఎల పెండింగ్‌పై, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం పడ్డ బకాయిలపై అసెంబ్లీలో చర్చ జరగాలని పేర్కొన్నారు. బిఎసి సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని తాము పట్టు పడతామని చెప్పారు. ప్రభుత్వం ఏ అంశంపైన చర్చ పెట్టినా తాము పూర్తి స్థాయిలో సిద్దంగా ఉన్నామని, తాము అడిగిన అంశాలపై చర్చ పెట్టేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.
కృష్ణా జలాలపై బిఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ వేస్తున్న అన్ని ఆరోపణలపై సభలోనే సమాధానం చెబుతానని వెల్లడించారు. 299 టిఎంసిలకు ఒప్పుకున్నది గత కాంగ్రెస్ ప్రభుత్వమే అని, అన్ని ఆధారాలతో కాంగ్రెస్ తప్పిదాలను ఎత్తి చూపుతామని పేర్కొన్నారు. 299 టిఎంసిలను వ్యతిరేకిస్తూ అపెక్స్ కౌన్సిల్‌లో తాము పిర్యాదు చేశామని గుర్తు చేశారు. ఈ మేరకు కేంద్రానికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం 32 లేఖలు రాసిందని తెలిపారు. కృష్ణా జలాలను తిరిగి రాష్ట్రాలకు పంచితేనే న్యాయం జరుగుతుందని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హుందా అనే పదం కాంగ్రెస్ పార్టీకి పలికే అర్హత లేదని విమర్శించారు. అసెంబ్లీలో నదీ జలాలపై ప్రభుత్వం పిపిటి ఇస్తే స్వాగతిస్తామని,అయితే తమకు కూడా పిపిటికి అవకాశం ఇవ్వాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.