హైదరాబాద్: సోమవారం (డిసెంబర్ 29) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీకి హాజరుకావాలని బిఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ నుంచి కెసిఆర్ హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. తాను అసెంబ్లీ సమావేశాలకు వస్తానని అధికార పక్షం ఎలాంటి ఎజెండాను ఖరారు చేస్తుందో చూసి ముందుకు వెళ్దామని పార్టీ నేతలతో కెసిఆర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అటు అసెంబ్లీలోనూ అనంతరం క్షేత్రస్థాయిలోనూ పోరాటం చేస్తానని కెసిఆర్ ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కెసిఆర్ విమర్శలు గుప్పించారు. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ధీటుగా సమాధానం ఇచ్చారు. దీంతో బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా ఉండే అవకాశముంది.