అమరావతి: గ్రామాల దత్తత.. ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పిఎం లంకను తాను దత్తత తీసుకోవడం కాదని.. ప్రజలే తనను దత్తత తీసుకున్నారని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పెదమైనవానిలంకలో డిజిటల్ భవన్ ను సందర్శించారు. డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం, ఎఐ నైపుణ్య శిక్షణ కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పిఎం లంకలోని సైక్లోన్ భవనం అన్ని విధాలుగా ఉపయుక్తమని, మహిళల మద్దతుతో సైక్లోన్ భవనం డిజిటల్ భవనంగా మారిందని తెలియజేశారు. ఈ భవనంలోనే విశ్వకర్మ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ఉపాధి ఉంటుందని, శిక్షణ పొందిన యువత దేశ, విదేశాల్లో మంచి స్థానంలో ఉన్నారని నిర్మలా పేర్కొన్నారు. శిక్షణపై సర్వేలో రెండో స్థానంలో పిఎం లంక నిలిచిందని, జాలర్ల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి ఉంటుందని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి మరిన్ని ఆలోచనలు చేయాలని, డ్రోన్ వినియోగంపై ఎపిలో తొలిసారి పిఎం లంకలో శిక్షణ ఇస్తున్నారని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.