సంగారెడ్డి: ప్రియుడి ఇంటి ముందు యువతి మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం మాణిక్ నాయక్ తండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిజాంపేట మండలంలోని మాణిక్ నాయక్ తండాకు చెంది సభావత్ శ్రీకాంత్, సిర్గాపూర్ మండలం కడపల్ విఠల్‌నాయక్ తండాకు చెందిన వడితే కావేరి గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేయాలని యువతి, యువకుడు ఇంట్లో వాళ్లను అడిగారు. ఇరుకుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు కలిసి హైదరాబాద్‌కు పారిపోయారు. రంగారెడ్డి జిల్లా ఎల్‌బి నగర్‌లో శ్రీకాంత్, కావేరి సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు మధ్య విభేదాలు రావడంతో కావేరి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో మృతదేహాన్ని తీసుకొని మాణిక్ నాయక్ తండాకు వెళ్లారు. ప్రియుడి ఇంటి ముందు మృతదేహంతో ధర్నాకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రాజీ కుదిర్చేందుకు పెద్ద మనుషులు యత్నిస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.