తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్, మన ప్యానెల్ పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రోగ్రెసివ్ ప్యానెల్ ప్రెస్‌మీట్‌లో దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ “సినీ ఇండస్ట్రీ మంచి కోసమే మేము పని చేస్తున్నాము. ఫిలిం ఛాంబర్ అమ్మలాంటి సంస్థ. ఆ సంస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. చిత్ర పరిశ్రమకు తండ్రి లాంటి వారు నిర్మాత. నిర్మాత బతికితేనే ఇం డస్ట్రీ నడుస్తుంది. ప్రోగ్రెసివ్ ప్యానెల్ చిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. అందరూ కూడా మా ప్యానల్ కి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం”అని అన్నారు. మైత్రీ నిర్మాత వై.రవిశంకర్ మాట్లాడుతూ “మా ప్యానెల్ లో ఉండే నిర్మాతలు అందరూ సంవత్సరానికి దాదాపు 70-, 80 చిన్న సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటాం. మేమందరం కూడా సపోర్ట్ చేసి చిన్న సినిమాల్ని రిలీజ్ చేస్తుంటాం. చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఉండదు. లిటిల్ హార్ట్, రాజు వెడ్స్ రాంబాయి సినిమాలు బాగా ఆడితే అవి పెద్ద సినిమాలే. నిర్మాతలు అందరం కలిసికట్టుగా ఉందాం. ఈ ప్యానల్‌ని అందరు గెలిపించాలని కోరుతున్నాము”అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్రవంతి రవికిషోర్, అశోక్‌కుమార్‌తో పాటు ప్రోగ్రెసివ్ ప్యానెల్ నిర్మాతలు అందరూ పాల్గొన్నారు.