న్యూఢిల్లీ : కాంగ్రెస్‌లో తాజాగా మరో సీనియర్ నేత బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలపై ప్రశంసలు కురిపించడం కాంగ్రెస్‌కు మరో తలనొప్పి వచ్చిపడినట్టు అవుతోంది. గుజరాత్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి సంబంధించిన పాత ఫొటోను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పంచుకున్నారు. ఇందులో బీజేపీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ కుర్చీలో కూర్చొని ఉండగా, ఆయన ముందు నేలపై ప్రధాని మోడీ కూర్చొన్నట్టు ఉంది. నేలపై కూర్చొన్న వ్యక్తి దేశానికి ప్రధానిగా అయ్యారంటూ మోడీని ఉద్దేశిస్తూ దిగ్విజయ్ కొనియాడారు. ‘ఆర్‌ఎస్‌ఎస్‌లో సామాన్య కార్యకర్తలా, నాయకుల పాదాల వద్ద నేలపై కూర్చొన్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ఎలా ఎదిగారో చూడండి. ఇది ఆ సంస్థ శక్తి ’ అని రాసుకొచ్చారు. ఈ పోస్టుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు రాహుల్, ప్రియాంక గాంధీలను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ మోడీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల మోడీకి కితాబిస్తూ థరూర్ చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. “ ఎప్పుడూ ఎలక్షన్ మోడ్‌లో ఉంటానని తనను అందరూ ఆరోపిస్తుంటారని మోడీ చెప్పారు. కానీ ఆయన ప్రజల సమస్యల విషయంలో ఎప్పుడూ ఎమోషనల్ మోడ్‌లో ఉంటారు” అని థరూర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.