దేశంలో నకిలీ గాంధీల మాటలను ప్రజలు విశ్వసించరని బిజెపి ఎంపీ రఘునందన్ రావు ధ్వజమెత్తారు. మహాత్మా గాంధీ పేరు చెప్పుకునే ఈ నకిలీ గాంధీలు మనుగడ కొనసాగిస్తున్నారని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీనుద్ధేశించి విమర్శించారు. మహాత్మా గాంధీపై ఈ నకిలీ గాంధీలకు నిజమైన ప్రేమ ఉంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పథకాలకు మహాత్ముని పేరు పెట్టారో తెలియజేస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సుమారు 150 పథకాలు చేపడితే అందులో కేవలం రెండు, మూడింటికే మహాత్మా గాంధీ పేరు పెట్టాలని ఆయన తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడి జరిగితే ఈ నకిలీలు కనీసం ఖండించలేదన్నారు. తండ్రి రాజీవ్ గాంధీ ఇవిఎంలను స్వాగతిస్తే, తనయుడు రాహుల్ గాంధీ వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందన్నారు. బిఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తిరిగి చురుగ్గా పాల్గొంటే ఆ పార్టీకి చేకూరే ప్రయోజనం ఏమీ లేదన్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కర్నాటక రాజకీయాలను చూసుకుంటే మంచిదని రఘునందన్ రావు హితవు చెప్పారు.