18 ఏళ్ల అయేషా మీరా హత్య కేసులో ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ అయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, బాషా మంగళగిరిలో శనివారం మహిళా కమిషన్ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 2007 డిసెంబర్ 27న 19 సంవత్సరాల బీ.ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా అత్యంత దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి నేటికి 18 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటివరకు అసలు నేరస్తులకు శిక్ష పడకపోవడం బాధాకరమని వారు తెలిపారు. సీబీఐ నివేదిక ప్రకారం కీలక సాక్షాలను ధ్వంసం చేసి, తప్పుడు దర్యాప్తు ద్వారా అమాయకుడైన పిడతల సత్యం బాబును కేసులో ఇరికించారని పేర్కొన్నారు. తొమ్మిది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన అనంతరం సత్యం బాబు నిర్దోషిగా విడుదలై, సత్యమేవ జయతే అని లోకానికి చాటిచెప్పారని గుర్తు చేశారు. అయితే అమాయకుడు విడుదల కావడం సరిపోదని, అసలు నేరస్తులకు కఠిన శిక్ష పడాలని మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, అయేషా మీరా తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
ఈ న్యాయపోరాటం ఫలితంగా 2018లో ఉమ్మడి హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు ప్రారంభమైందన్నారు. సీబీఐ దర్యాప్తులో రాజకీయ నాయకుల కుటుంబాలకు సంబంధించిన కీలక సాక్షాలు మాయం చేసినట్టు వెలుగులోకి వచ్చిందని, నేరస్తులను కాపాడేందుకు కొందరు అధికారులు ప్రయత్నించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే 2025 జూన్ 25న హైకోర్టులో సీబీఐ సమర్పించిన సీల్డ్ కవర్ నివేదిక తీవ్రంగా నిరాశపరిచిందని తెలిపారు. అప్పటి నుంచి న్యాయం కోసం ఎదురుచూస్తున్న తమకు తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. అయేషా మీరా హత్య జరిగిన సమయంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారని, ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అయేషా మీరా తల్లిదండ్రులకు అండగా నిలిచి రాష్ట్రవ్యాప్తంగా సభలు, ధర్నాలు, నిరసనలు నిర్వహించిందని గుర్తు చేశారు. అయేషా మీరా చనిపోయిన రోజును స్మరణ దినంగా ప్రకటించాలని, ఆమె పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు పాల్గొని అయేషా మీరా కుటుంబానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.