న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. భారీ ఎత్తున డ్రగ్స్‌తోపాటు 40 కి పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 285 మందిని అరెస్టు చేశారు. ‘ఆపరేషన్ ఆఘాత్ 3.0 ’ పేరిట ఆగ్నేయ ఢిల్లీ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు అర్ధరాత్రి వేళ తనిఖీలు చేపట్టారు. వీధి రౌడీలు, నేరస్థులతో సంబంధం ఉన్న అనుమానితులే లక్షంగా తనిఖీలు చేశారు. కొత్త సంవత్సర వేడుకల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా దీన్ని నిర్వహించినట్టు పోలీసులు చెప్పారు.
ఈ ఆపరేషన్‌లో 285 మందిని అరెస్టు చేశామని, మరో 504 మందిని అదుపు లోకి తీసుకున్నామని పేర్కొన్నారు. వారి నుంచి దేశీయంగా తయారు చేసిన 21 పిస్టల్స్, 20 తూటాలు, 27 కత్తులతో పాటు పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. నిందితుల నుంచి దాదాపు రూ.2 లక్షలు పట్టుకున్నట్టు వివరించారు. ఈ క్రమంలో 320 మొబైల్ ఫోన్లు, 231 ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నామని , ఇవన్నీ దొంగిలించిన వస్తువులుగా గుర్తించామని పేర్కొన్నారు.