ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీని ప్రధానిగా చేయండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోండి..అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్‌లో ఇరవై మంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపించండి, రెండున్నర లక్షల కోట్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకోండి అని శనివారం విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. విశాఖ ఉక్కు&ఆంధ్రుల హక్కు అనే నినాదానికి ఒక చరిత్ర ఉందని ఆయన తెలిపారు. విశాఖ ఉక్కు ఉద్యమం వల్లే బిజెపి అగ్ర నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు జాతీయ స్థాయికి ఎదిగి, ఉప రాష్ట్రపతి అయ్యారని ఆయన గుర్తు చేశారు. నాడు పద్నాలుగు వేల కోట్లతో ఇందిరా గాంధీ ప్రారంభించిన
విశాఖ ఉక్కు కర్మాగారం ఇప్పడు రెండున్నర లక్షల కోట్ల సంపదకు పెరిగిందన్నారు. అటువంటి విలువైన విశాఖ ఉక్కుపై ప్రధాని నరేంద్ర మోడీ కన్ను పడిందని, దురుద్దేశ్యంతో ఎవరికో కట్టబెట్టాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడడంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ప్రధాని మోడీకి సన్నిహితుడైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంకా అనేక మంది పలుకుబడి నాయకులు ఉన్నా ప్లాంట్‌ను కాపాడుకోవడంలో విఫలమయ్యారని జగ్గారెడ్డి విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నది తన ఆకాంక్ష అని అన్నారు.