హుస్నాబాద్: దివంగత ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలతో పాటు జాతిపిత మహాత్మా గాంధీ ల పేర్లు లేకుండా చేయాలని బిజెపి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. హుస్నాబాద్ లో గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పొన్నం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని, మరోసారి తన నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామన్నారు. దానికి బీజం తెలంగాణ నుంచే పడిందని, తెలంగాణలో ప్రజా ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నడుస్తోందన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పుంజుకుని, మరోసారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టి ప్రజల ఆకాంక్షలను, ఆశయాలను నెరవేరుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం కేవలం రాజకీయ చరిత్ర మాత్రమే కాదు అని, అది త్యాగం నుండి స్వప్నం వరకు, ఉద్యమం నుండి పరిపాలన వరకు సాగిన భారత ప్రజాస్వామ్య గాథ అని గుర్తు చేశారు. నిన్నటి పోరాటం, నేటి ఆలోచన, రేపటి ఆశ ఈ మూడింటి మధ్య కాంగ్రెస్ పార్టీ ఒక వారధిగా నిలిచిందని పొన్నం ప్రశంసించారు.