దేశంలో అత్యాచారాల కంటే వరకట్న మరణాలే అత్యధికంగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. తల్లిదండ్రులు ఆడపిల్లలను అల్లారుముద్దుగా పెంచి పెద్దచేసి చదువులు చెప్పిస్తారు. తమ కుటుంబ మర్యాద, హోదాకు తగిన సంబంధం చూసి పెళ్లి చేస్తారు. అత్తింటి వారు అడిగిన చీరెసారెలతోపాటు వరకట్నం చెల్లిస్తారు. మెట్టినింట తమ బిడ్డ సుఖపడుతుందని ఎన్నో కలలు కంటుంటారు. తీరా పెళ్లి జరిపించిన తరువాత మితిమీరిన ధనదాహంతో వరకట్నం చాలలేదని లేదా ఇంకా మరికొన్ని గొంతెమ్మ కోరికలు తీర్చలేదని ఏవో సాకులతో మగడే కాలయముడై పేట్రేగిపోవడం, అత్తమామలు కిరాతకులై హింసించడం చేస్తే ఆ ఇంటి దీపానికి ఎవరు దిక్కు. తల్లిదండ్రులకు లేదా బంధువులకు చెప్పుకోలేక కుమిలికుమిలి ఆత్మహత్యకు పాల్పడడమే శరణ్యమవుతోంది. ఈ విషాదాంత గాథలకు వరకట్న పిశాచమే కారణం. కేరళలో 2021లో వివాహిత అయిన వైద్య విద్యార్థిని విస్మయ (22) ఆత్మహత్య కేసు దేశంలో సంచలనం కలిగించింది. రెండు లక్షలు కట్నం ఇవ్వడంతోపాటు 100 సవర్ల బంగారం, ఎకరం భూమి, రూ. 10 లక్షల విలువైన కారు, ఇచ్చినా వరుని వరకట్న దాహం ఆరలేదు. ఇంకా కావాలని విస్మయను చిత్రహింసలకు గురిచేయడంతో ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ కేసులో నిందితుడు భర్త కిరణ్ కుమార్‌కు కోర్టు పదేళ్లు జైలు శిక్షతోపాటు రూ. 12.55 లక్షల జరిమానా విధించింది. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నొయిడాలో ఇచ్చిన కట్నం చాల్లేదని భర్త, అత్తింటివారు కలిసి ఆ ఇల్లాలి ప్రాణాలు తీసేశారు. రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌కు చెందిన ప్రభుత్వ టీచర్ వరకట్న వేధింపులకు భరించలేక తన కూతురితోసహా ఆత్మహత్య చేసుకుంది. ఈ విధంగా ప్రతిరోజూ సగటున 19మంది మహిళలు వరకట్న జ్వాలలకు బలైపోతున్నారని నేషనల్ క్రైమ్ బ్యూరో నివేదిక వెల్లడించింది. వరకట్న నిషేధ చట్టం 1961 నుంచి అమలులో ఉన్నా వరకట్నం మరణాలు ఆగడం లేదు. ఇరవై ఏళ్ల వధువు కాళ్లపారాణి ఆరకముందే వరకట్న పిశాచానికి బలైన దుర్ఘటన సుప్రీం కోర్టు ధర్మాసనం ముందుకు ఇటీవల విచారణకు రాగా, సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాజంలో సాగుతున్న వికృత ఆచారానికి ఇది ప్రతీక అని వ్యాఖ్యానించింది. అర్బన్ సెంటర్లలో ముస్లిం కుటుంబాలు కూడా తమ హోదాగా భావించి వరకట్నం తీసుకునే పద్ధతి మెహెర్‌గా ప్రారంభించారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
ఆస్తికి యాజమాన్య హక్కు ద్వారా మహిళలకు సాధికారత కల్పించాలనే ఇస్లామిక్ వాస్తవ లక్షానికి ఇది విరుద్ధమని, దీనికి భిన్నంగా వరకట్నం చెల్లిస్తే భర్త లేదా అతని కుటుంబం నియంత్రణలోనే మహిళకు సాధికారత కోల్పోవలసి వస్తుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. దీనిపై విద్యార్థి దశ నుంచే చైతన్యం కలిగేలా పాఠ్యాంశాల్లో మార్పు తీసుకురావాలని సూచించింది. వివాహాల్లో వధువు లేదా వరుని తరపు వారు ధనం లేదా కానుకల రూపంలో ఇచ్చిపుచ్చుకోవడంలో ఒకరికింద మరొకరు అణిగిమణిగి ఉండవలసిన అవసరం లేదని, అసలు ఈ వరకట్న ఆచారం సాగనివ్వని విధంగా రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలని సూచించింది. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించేలా వరకట్న నిషేధ అధికారులను (డౌరీ ప్రొబేషన్ ఆఫీసర్లు) రాష్ట్రాల్లో నియమించాలని ఆదేశించింది. ఆ అధికారులకు బాధ్యతలపై అవగాహన కల్పించడంతోపాటు తగిన వనరులు అందించాలని సుప్రీం కోర్టు సూచించింది.
వరకట్నం కేసులను విచారించే పోలీస్ అధికారులకు, జ్యుడీషియల్ అధికారులకు దీనిపై తగిన శిక్షణ, స్పృహ కల్పించాలని కూడా సుప్రీం కోర్టు సూచించింది. పెండింగ్‌లో ఉన్న వరకట్నం కేసులను ఎప్పటికప్పుడు త్వరితగతిన పరిష్కరించాలని హైకోర్టులను సుప్రీం అభ్యర్థించింది. హ్యూమన్ డెవలప్‌మెంట్ సర్వే (200405) లో వెల్లడైన వివరాల ప్రకారం పెళ్లిళ్లలో వరుడి కుటుంబంతో పోలిస్తే వధువు కుటుంబం 1.5 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నట్టు వెల్లడైంది. 24శాతం కుటుంబాలు నగదు రూపంలో వరకట్నం చెల్లించడంతోపాటు టివిలు, ఫ్రిజ్‌లు, కార్లు, బైక్‌లు, తదితర ఖరీదైన బహుమానాలను కూడా వరునికి సమర్పించినట్టు తెలిసింది. 201921 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 18 49 ఏళ్ల మధ్య వయసు గల మహిళల్లో 29 శాతం మంది భర్తలు లేదా అత్తింటివారి నుంచి శారీరక లేదా లైంగిక హింస అనుభవిస్తున్నారని బయటపడింది. ఎన్‌సిఆర్‌బి డేటా ప్రకారం ఏటా 6516 వరకట్నం మరణాలు సంభవిస్తున్నాయి. 20172022 మధ్య ఏటా 6516 వరకట్న మరణాలు సంభవించాయి.
2022 చివరినాటికి 60,577 వరకట్నం కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అందులో 54,416 కేసులు ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్నాయి. ఆ ఏడాది 3689 కేసులు విచారణ పూర్తయినా, కేవలం 33% తీర్పుల్లో నిందితులకు శిక్షపడింది. కోర్టులకు పంపిన 6161 కొత్త కేసుల్లో కేవలం 99 కేసుల్లో మాత్రమే శిక్షలు అమలయ్యాయి. దీన్ని బట్టి చూస్తే బాధిత కుటుంబాలకు ఏడాది లోపు న్యాయం దొరికే అవకాశాలు రెండు శాతం కంటే చాలా తక్కువేనని తేలింది. 2024లో నమోదైన కేసుల్లో 17% వరకట్న వేధింపుల కేసులే ఉన్నాయి. నమోదైన 25743 కేసుల్లో 4383 కేసులు వరకట్న వేధింపులవే. దక్షిణాది కన్నా ఉత్తరభారతంలోనే ఈ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. దేశంలోని మొత్తం 19 నగరాల్లో ఢిల్లీలో అత్యధికంగా 30% వరకట్న వేధింపుల కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో కాన్పూర్, బెంగళూరు, లక్నో, పాట్నా వంటి నగరాలు ఉన్నాయి. బాధితులు చివరివరకూ న్యాయపరమైన సహాయాన్ని కోరడంలో వెనకడుగు వేస్తుండటంతో చాలా కేసులు బయటపడడం లేదు.