రాష్ట్రంలో ఇంటర్ ప్రాక్టికల్స్‌పై ఈసారి సిసి కెమెరాలు, ఫ్లైయింగ్ స్వాడ్ల బృందాల పర్యవేక్షణలో జరుగనున్నాయి. వచ్చే ఫిబ్రవరి 2 నుంచి 21వ తేదీ వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరంతోపాటు ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు ఇంటర్ సైన్స్ గ్రూపులకు చెందిన దాదాపు 4 లక్షల మంది హాజరవుతారు. రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో ఎక్కువగా థీయరీపైనే దృష్టి సారించి, ప్రాక్టికల్స్‌ను విస్మరించారన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని కాలేజీల్లో అవసరమైనా సామాగ్రి లేకపోవడం, మరికొన్నింటిలో నేర్పించే సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాటు చేస్తోంది. ర్యాంకుల పందేరంలో ప్రాక్టికల్స్ మార్కులే కీలకం. ఇంటర్ ప్రాక్టికల్స్‌లో ఎంపిసి వారికి 60 మార్కులు, బైపిసి వారికి 120 మార్కులు ఉన్నాయి. ఒక్క మార్కు తేడాతో కూడా ర్యాంకులు తారుమరవుతుంటాయి. దాంతో ర్యాంకుల పోటీలో ప్రతి మార్కూ కీలకంగానే మారుతుంది.