అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై ఉద్యమ కార్యాచరణపై బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సిఎం కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో కెసిఆర్ పార్టీ ముఖ్యనేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కెసిఆర్ పార్టీ దిశానిర్ధేశం చేసినట్లు తెలిసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని కెసిఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దానిపై ఈ సమావేశంలో సుధీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. రానున్న రోజుల్లో జిల్లాల్లో నిర్వహించాల్సిన బహిరంగ సభలు,
నియోజకవర్గ స్థాయి కార్యక్రమాల తేదీలపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీ శ్రేణులు ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కెసిఆర్ నేతలకు సూచించినట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర విధానాల పట్ల పోరాటం చేయాల్సిందే అని, ప్రజాక్షేత్రంలో ఈ రెండు పార్టీల విధానాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేసినట్లు తెలిసింది. తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను పరిక్షించుకునే బాధ్యత బిఆర్‌ఎస్‌పైనే ఉంటుందని, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలని చెప్పినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ముందు నిర్ణయించిన విధంగా బిఆర్‌ఎస్ సభలు ఏర్పాటు చేయాలని పార్టీ నేతలకు వివరించినట్లు తెలిసింది.