పేదలకు అత్యున్నతమైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆస్పత్రిలో రూ.23.75 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ ను ఆయన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ప్రసూతి గది, మైనర్ ఒటి, 13 పడకల ఐసోలేషన్ వార్డులను ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నాయని వివరించారు. ముఖ్యంగా వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలను పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం రూ.1.50 లక్షల కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు. వైద్య విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయ ఉత్పత్తులకు నాణ్యమైన గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భూగర్భ జలాలు పెంచేందుకు ప్రతి వర్షపు నీటిని సంరక్షించుకోవాలని సూచించారు. త్వరలోనే ఆదిలాబాద్‌లో కేంద్రీయ విద్యాలయం ప్రారంభోత్సవం ఉంటుందని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం దేశ ప్రధాని నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాలో సామాజిక వర్గాలు అధికంగా ఉన్నందున, వారి ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఆరోగ్య, వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మాత, శిశు మరణాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం చేపడుతుందని ప్రకటించారు. నూతనంగా 6,956 మంది స్టాఫ్‌నర్సులను, 4,330 మంది డాక్టర్లను నియమించినట్లు వెల్లడించారు. ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తనవంతు సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సమన్వయంతో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి తక్షణ చర్యలు చేపడుతున్నాయని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ సహకారం అందిస్తున్నాయని ఆదిలాబాద్ ఎంపి జి. నగేష్ అన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్న క్రిటికల్ కేర్ బ్లాక్ పూర్తయితే ఆదిలాబాద్‌తో పాటు సమీప జిల్లాల ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వైద్య రంగంలో ఈ ప్రాజెక్టు మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. జిల్లాలో ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్ నిర్మాణం ద్వారా ఆదిలాబాద్ జిల్లా ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు తాను కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పూర్తి సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. ఎంఎల్‌ఎ పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి పనులు ఇప్పుడు కార్యరూపం దాలుస్తున్నాయని అన్నారు. రిమ్స్ ఆసుపత్రిని అత్యాధునిక వైద్య సదుపాయాలతో అభివృద్ధి చేయడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. జిల్లాలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు కల నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయని, ఇది ఆదిలాబాద్ భవిష్యత్తును మారుస్తుందని అన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల శాసనసభ్యులు అనిల్ జాదవ్, వెడ్మా బొజ్జు, ఎమ్మెల్సీలు విఠల్, కొమురయ్య జిల్లా గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, ఆర్డీఓ స్రవంతి, వివిధ శాఖల అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.