బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేనేజ్‌మెంట్ కోటాలో రాజకీయాల్లోకి వచ్చి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్‌గా జెడ్‌పిటిసీగా ఎన్నికయ్యారని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా రెండు సార్లు, ఎంపీగా ఒకసారి గెలుపొందారని, ఆ తర్వాత పిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన వివరించారు. మెరిట్ కోటా, పేమెంట్ కోటా, మేనేజ్‌మెంట్ కోటా ఎవరిదో రాష్ట్ర ప్రజలకు తెలుసునని అన్నారు. కెటిఆర్ ఐరన్ లెగ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మారారని ఆయన విమర్శించారు.
నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషిస్తే ప్రజలు హర్షిస్తారని ఆయన అన్నారు. బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను నిర్వర్తించడం లేదు కాబట్టి కెటిఆర్ తీసుకుని ప్రభుత్వానికి తగు సలహాలు, సూచనలు చేస్తే బాగుంటుందని కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఎప్పుడూ అధికారంలో తమదేనన్న ధీమాతో బిఆర్‌ఎస్ నియంత పాలన చేసిందని ఆయన దుయ్యబట్టారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం అంటే డబ్బులు ఇవ్వడం కాదని, వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి కోటీశ్వరులుగా చేయాలన్న లక్షంగా పెట్టుకున్నదని ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి వివరించారు.