చేపల వేటకు వెళ్లిన జాలరి ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, చింతిర్యాలలో చోటుచేసుకుంది. శుక్రవారం ఈ సంఘటనపై సిఐ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చింతిర్యాల గ్రామానికి చెందిన జాలరి నాగుల వెంకటరమణయ్య (45) ప్రతి రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం గోదావరిలో చేపల వేటకు వల వేయడానికి వెళ్లి ఇంటికి రాలేదు. దీంతో అతని భార్య, వారి బంధువులు గోదావరి వద్ద వెతకగా బోటు కనిపించింది. కానీ వెంకటరమణయ్య జాడ కనపడకపోవడంతో భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వెంటనే సంఘటనా స్ధలానికి చేరుకుని గ్రామస్థులతో కలిసి గాలిస్తూ, అగ్నిమాపక శాఖకు, ఎన్‌డిఆర్‌ఎఫ్, రెస్కూ టీమ్‌కు సమాచారం అందించారు. వారు వచ్చిన వెంటనే గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు మెడ చుట్టూ చలికాలంలో కప్పుకున్న రగ్గు ఉండటంతో వలవేయడానికి మోటార్ బోటును ఉపయోగిస్తుండగా మోటారు తీగలో రగ్గు చుట్టుకొని మెడకు బిగుసుకుపోవడంతో మృతి చెంది నీటిలో పడిపోయాడని గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి తమ్ముడు నాగుల సింహాచలం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.