బంగ్లాదేశ్ లో ఈ మధ్య ఇద్దరు హిందూ పురుషులను కొట్టి చంపిన ఘటనలపై భారతదేశం శుక్రవారం నాడు తీవ్రంగా ఖండించింది. హిందూ మైనారిటీలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండ పెరిగిపోవడం పట్ల విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హత్యలకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. మొన్న దీపు చంద్ దాస్, నిన్న సామ్రాట్, ఇలా హిందూ మైనారిటీలపై నిరంతరం కక్షపూరితంగా దాడులు చేయడం ఆందోళకరం, ఈ హిందూ యువకుల హత్యలను మేం ఖండిస్తున్నాం , నేరస్తులను కోర్టు ఎదుట నిలబెట్టి, కఠినమైన శిక్ష పడేటట్లు చూడాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ డిమాండ్ చేశారు. మైనారిటీలపై జరిగిన దాడులను తప్పుడు కథనాలు గా చిత్రీకరించే ధోరణిని దుయ్యబట్టారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హయాంలో మైనారిటీలపై 2,800 పైగా హింసాత్మక ఘటనలు జరిగాయని విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది.బుధవారం రాత్రి రాజ్ బరి జిల్లాలో ఒక హిందూ వ్యక్తిని అల్లరి మూక కొట్టి చంపింది. బాధితుడిని సమ్రాట్ గా పిలిచే 30 ఏళ్ల అమృత్ మండల్ గా పోలీసులు గుర్తించారు. కాగా,బంగ్లాదేశ్ పోలీసులు మాత్రం
ఇది హింస దోపిడీ కారణంగా ఆగ్రహించిన ప్రజలు జరిపిన దాడిగా పేర్కొంటున్నారు. పోలీసుల కథనం ప్రకారం సామ్రాట్ గ్రామంలో ఒకరి ఇంటికి డబ్బు వసూలు కోసం వెళ్లగా, గ్రామస్తులు అతడితో గొడవ పడ్డారు అదే హింసాత్మక ఘర్షణగా మారిందని, దాడిలో గాయపడి పరిస్థితివిషమించడంతో అతడిని స్థానిక ఆస్పత్రిలో చేర్చగా అతడు చనిపోయాడని చెబుతున్నారు. సామ్రాట్ పై స్థానిక పోలీసు స్టేషన్ లో హత్య కేసుతో సహా పలు కేసులు ఉన్నాయని సామ్రాట్ బాహినీ అనే క్రిమినల్ ముఠా నాయకుడని పోలీసులు చెప్పారు.బంగ్లాదేశ్ లోని మైమెన్ సింగ్ జిల్లాలో ఒక హిందూవ్యక్తిని కొట్టి చంపిన కొద్దిరోజులకే ఈ ఘటన జరిగింది. 27 ఏళ్ల గార్మెంట్ ఫ్యాక్టరీలో కార్మికుడు దీపు చంద్ర దాస్ దైవధూషణ చేశాడని ఆరోపిస్తూ ఓ అల్లరి మూక అతడిని కొట్టి చంపి శవాన్ని చెట్టుకు వేలాడదీసి తగుల పెట్టారు. దీనిపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి చెందిన యూనిస్ కంటితుడుపుగా ఓ ప్రకటన విడుదల చేశారు. భారత ప్రభుత్వం ఈ సంఘటనలను నిశితంగా పరిశీలిస్తోందని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి హెచ్చరించారు.