హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ చెక్ డ్యామ్ లు నిర్మిస్తే.. వీళ్లు బాంబులు పెట్టి పేలుస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఎన్నో హామీలిచ్చి సిఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోతెలంగాణ భవన్ లో కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో పలువురు నేతలు చేరారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్నది కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు మాత్రమేనని విమర్శించారు. మేడిగడ్డను కూల్చిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు చెక్ డ్యామ్ లు పేలుస్తున్నారని, ఎన్నో హామీలిచ్చిన రేవంత్ రెడ్డి అన్నీ ఎగవేశారని మండిపడ్డారు. రేవంత్ కిస్మత్ బాగుండి పేమెంట్ కోటాలో సిఎం అయ్యారని, హామీల గురించి అడిగితే.. రేవంత్ రెడ్డి బూతులు తిడుతున్నారని మండిపడ్డారు. తిట్ల భాష తమకు వచ్చునని.. కానీ తాము తిట్టమని అన్నారు. పెంచుతున్న పింఛన్లు ఎప్పట్నుంచి ఇస్తారో సిఎం చెప్పాలని ప్రశ్నించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో వరసగా రెండుసార్లు గెలిపించారని, హైదరాబాద్ ప్రజలకు తాను పాదాభిషేకం చేసినా.. తక్కువేనని పేర్కొన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోయారని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.