మన తెలంగాణ/ఆలేరు : వెంచర్ డెవలప్మెంట్ పనుల పేరుతో రూ.30 లక్షలు తీసుకుని పనులు చేయకపోవడంతో పాటు కులం పేరుతో దూషించి, అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ జనగాం జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సూరారం యాదగిరి ఆలేరు పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేసిన కేసు రిజిస్టర్ చేయకపోవడాన్ని నిరసిస్తూ గురువారం పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై ఎమ్మార్పీఎస్ నాయకులతో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనగామ జిల్లాతో పాటు చుట్టుపక్కల తాము ఎన్నో వెంచర్లు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఆరు నెలల క్రితం వెంచర్ డెవలప్మెంట్ పనుల కోసం పటేల్ గూడెం గ్రామానికి చెందిన ప్రకాశ్ రెడ్డికి రూ.30 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చినట్లు తెలిపారు.
నెలలు గడిచినా పనులు ప్రారంభించకపోవడంతో డబ్బులు అడిగితే, కులం పేరుతో దూషించి గేట్ వేసి తనను నిర్బంధించి కారు తాళాలు తీసుకొని భయభ్రాంతులకు గురి చేశాడని ఆరోపించారు. ప్రాణ భయంతో బయటపడి ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ 48 గంటలు గడిచినా ప్రకాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులతో రాస్తారోకో నిర్వహించారు. ప్రకాష్ రెడ్డి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని, రూ.30 లక్షలు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. తనకు న్యాయం జరగకపోతే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, ఏసీపీ, ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామని యాదగిరి తెలిపారు.