అమరావతి: శాస్త్ర విజ్ఞానంతోనే మానవాళికి సుఖ సదుపాయాలు కలుగుతాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. మనుషులందరికీ సౌఖ్యం, సదుపాయాలు కావాలని అన్నారు. తిరుపతి జాతీయ సంస్కృత వర్శిటీలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. సుఖం అనేది భౌతికపరమైనదని, సుఖదు:ఖాలు తాత్కాలికమైనవని తెలియజేశారు. మనం పొందుతున్న వాటిలో రెండో కోణం కూడా ఉంటుందని, సుఖం అనేది కేవలం మానసికపరమైనదని అన్నారు. మనమంతా ఈ విశ్వానికి ఎంతో కొంత రుణపడి ఉన్నామని, మానసికంగా సంతృప్తి లేకపోతే ఎంతపొందినా సుఖం కలగదని చెప్పారు. క్షమాగుణమే మనిషిని ఉన్నత స్థితిలో నిలుపుతుందని, కొంతమందిలో ఎంత ఎదిగితే అంత అహంకారం పెరుగుతుందని అన్నారు. అర్థశాస్త్రానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎన్నో నిర్వచనాలు ఇచ్చారని, చాణక్యుడి అర్థశాస్త్రం ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యత ఇచ్చిందని మోహన్ భగవత్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వయంగా కర్తవ్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని, విజ్ఞానశాస్త్రం-ధర్మ శాస్త్రాల మధ్య వైరుధ్యమేమీ లేదని తెలిపారు. అనుభవంతో ఎంతో విజ్ఞానాన్ని సంపాదిస్తామని, అనుభవం పాఠాలను కూడా నేర్పిస్తుందని సూచించారు. సరైన మార్గంలో పయనిస్తే ఏదైనా సాధ్యమని.. స్వామి వివేకానంద వంటివారు భోదించారని, మనం వెళ్తున్న మార్గం సరైనదిగా ఉండాలని అన్నారు. మార్గం సరైనదైతే లక్ష్యానికి కచ్చితంగా చేరుకోగలమని మోహన్ భగవత్ స్పష్టం చేశారు.