అమరావతి: దశాబ్దకాలంగా స్టార్టప్లలలో భారత్ దూసుకుపోతోందని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. ఐటి, టెలివిజన్ రంగాల్లో పెట్టుబడులు సరళీకరణ చేశామన్నారు. తిరుపతి జాతీయ సంస్కృత వర్శిటీలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం సిఎం చంద్రబాబు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తో కలిసి ప్రారంభించారు. ఈ నెల 29 వరకు భారతీయ విజ్ఞాన సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ సమ్మేళనంలో జితేంద్రసింగ్ పాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎకానమీలో 8వ స్థానానికి చేరుకున్నామని, చంద్రుడిపై ప్రయోగాల్లో భారత్ ఘన విజయాలు సాధించిందని కొనియాడారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో 81వ ర్యాంక్ నుంచి 38వ ర్యాంక్ కు చేరుకున్నామని, రక్షణరంగ ఎగుమతుల్లో గణనీయ వృద్ధి సాధించామని జితేంద్రసింగ్ తెలియజేశారు. మన బ్రహ్మోస్ క్షిపణులకు ఇప్పుడు ప్రపంచంలో ఎంతో డిమాండ్ ఉందని, ప్రపంచానికి కొవిడ్ వ్యాక్సిన్లు అత్యధికంగా ఎగుమతి చేసిన దేశం భారత్ అని ప్రశంసించారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు బడ్జెట్.. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలోనే పెరిగిందని, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నామని అన్నారు. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ త్వరలోనే మూడో స్థానానికి చేరుకుంటుందని, అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలను కూడా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. కీలక ఖనిజాల విషయంలో ప్రైవేటు సంస్థలకూ అనుమతి ఇస్తున్నామని జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.