చిత్ర పరిశ్రమలు తాము నమ్మిన విలువలకు కట్టుబడి పనిచేస్తాయి. స్త్రీద్వేషాన్ని ప్రదర్శించే నటీనటుల పట్ల అవి చాలా స్పష్టమైన వైఖరితో వ్యవహరిస్తాయి. హాలీవుడ్, బాలీవుడ్‌లో స్త్రీ ద్వేషాన్ని కనబరిస్తే వారి వృత్తికే ఎసరొస్తుంది. వారి కెరీర్ కు గండిపడుతుంది. వారికి ఆయా సంస్థలు మద్దతు ఉపసంహరించుకుంటాయి. దీనికి విరుద్ధంగా టాలీవుడ్‌లో ఇలాంటి ప్రవర్తనను తరచుగా చాలా తేలిగ్గా తీసుకోవడం జరుగుతోంది. భారతదేశంలో స్త్రీ ద్వేషాన్ని సమర్థించుకునేందుకు ఉపయోగించే భాష మరీ దారుణంగా ఉంటుంది. ఒక మహిళ వేధింపులకు గురైనప్పుడు లేదా ఆమెపై అభ్యంతరకరమైన భాష వాడినప్పుడు లేదా అవమానించినప్పుడు ఆమె పాశ్చాత్య ధోరణులకు అలవాటు పడుతోంది. అందుకే అలా మాట్లాడాం అని సమర్ధించుకునే ప్రయత్నం చేస్తారు. మహిళలను కించపరిచేలా మాట్లాడేవారు సాంప్రదాయం, విలువల ముసుగులో తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, పాశ్చాత్య సినీ పరిశ్రమలు స్త్రీ ద్వేషంపై స్పందించే తీరును గమనించినప్పుడు ఈ వాదనలన్నీ పసలేనివిగా తేలిపోతాయి. నటుడు శివాజీ వివాదం ద్వారా ఈ విషయం మరోసారి రుజువైంది.
ఇటీవల జరిగిన ఒక సినిమా కార్యక్రమంలో శివాజీ మహిళల దుస్తుల గురించి, వారి గౌరవం గురించి అనవసరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళలను కించపరిచే విధంగా అతను వాడిన భాష వివాదాస్పదమైంది. బిగ్ బాస్ లో పనిచేసినప్పుడు శివాజీ పదేపదే మహిళల పట్ల ద్వేషపూరిత ప్రవర్తనను ప్రదర్శించాడు. మహిళా పోటీదారులను తిట్టాడు. వారి స్వభావాన్ని ప్రశ్నించాడు. ఒక సందర్భంలో ఒక కుమార్తె ఇలాగే ప్రవర్తిస్తే, ‘ఆమె మెడపై కాలు వేసి తొక్కేస్తానని‘ పేర్కొన్నాడు. ఈ డాక్యుమెంట్ నమూనా ఉన్నప్పటికీ, బిగ్ బాస్ తర్వాత శివాజీని ‘కోర్ట్’ సినిమాకు ఎంపిక చేయడం గమనార్హం. సోషల్ మీడియాలో ప్రజలు ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ నిర్మాత అయిన నానిని విమర్శిస్తున్నారు.
బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, అక్కినేని, చలపతిరావు వంటి సీనియర్ నటులు కూడా గతంలో బహిరంగ వేదికలపై అనుచితమైన, స్త్రీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే, నిరంతరం నిరసనలు ఎదురవుతూ ఉండటంతో వారు అలాంటి వ్యాఖ్యలు చేయడం మానేశారు. హాలీవుడ్ కు, టాలీవుడ్ కు తేడా ఇదే. హాలీవుడ్ లో స్త్రీలపై చేసే అభ్యంతరకరమైన వ్యాఖ్యలను వ్యక్తిగత అభిప్రాయాలుగా పరిగణించరు. గతంలో చాలామంది పేరున్న నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు ఇలాంటి వ్యాఖ్యలు చేసి, తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయి. నటుడు జానీ డెప్ తనకు అభ్యంతరకమైన మెస్సేజ్ లు పంపించాడంటూ నటి ఆంబర్ హెర్డ్ చేసిన ఆరోపణల కారణంగా ఆయన అనేక సినిమాలలో ప్రధానమైన పాత్రలు కోల్పోయాడు.
మహిళలపై తరచూ అసహ్యకరమైన జోకులు వేసే, వ్యాఖ్యలు చేసే రస్సెల్ బ్రాండ్ పై ఒక దశలో లైంగిక దాడి ఆరోపణలు వెల్లువెత్తడంతో అనేక ప్రాజెక్టులు అతని చేజారాయి. ఇలాంటి దృష్టాంతాలు మరెన్నో ఉన్నాయి. టాలీవుడ్ సైతం ఇటీవలి కాలంలో ఇదే పంథాను అనుసరించడం మొదలు పెట్టింది. ‘మీ టూ’ ఉద్యమ సమయంలో సాజిద్ ఖాన్, అలోక్ నాథ్ వంటివారిని అనేక ప్రాజెక్టులనుంచి తొలగించారు. వీరి చేష్టల కారణంగా సినీ పరిశ్రమ ప్రతిష్ఠ దెబ్బ తింటోందని భావించడమే అందుకు కారణం. ‘పాశ్చాత్య సంస్కృతి మనల్ని భ్రష్టు పట్టిస్తోంది’ అనే సాధారణ భారతీయ పల్లవి అర్థరహితమైనదనే విషయాన్ని ఈ సంఘటనలన్నీ నిరూపిస్తున్నాయి.
ఒకవేళ స్త్రీ ద్వేషం అనేది పాశ్చాత్య దేశాలనుంచి దిగుమతి అయిందే అయితే దానిని హాలీవుడ్ తప్పకుండా సమర్థించి ఉండేదే. కానీ, వాస్తవానికి హాలీవుడ్ అందుకు శిక్షలు విధిస్తోంది. టాలీవుడ్ విషయానికొస్తే, దాని తీరు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఇక్కడ స్త్రీ ద్వేషాన్ని భారతీయ విలువలను కారణంగా చూపి సమర్థిస్తూ, జవాబుదారీతనాన్ని మాత్రం పాశ్చాత్య ప్రభావంగా తోసిపుచ్చుతున్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడే నటులను సమర్థిస్తున్నారు. అభిమానులు వారికి మరింత రక్షణ కల్పిస్తున్నారు. బాధితులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారిని అవహేళన చేస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో స్త్రీ ద్వేషం ఒక ప్రమాదం కాదు… ఒక ప్రమాణపత్రం. ఆధిపత్యానికి ఒక అడ్డదారి.
– కౌసల్య రాచవేల్పుల
(ఫ్రైడే వాల్ సౌజన్యంతో..)