భారతదేశం ప్రధాన మూలసూత్రం ‘భిన్నత్వంలో ఏకత్వం’ అయితే దానికి సరైన ప్రతిరూపం కేరళ రాష్ట్రం. ఎన్నో జాతులు, మతాలు, సామాజిక వర్గాలకు చెందిన వారు ఇక్కడ కలసిమెలసి సామరస్యంగా కొన్ని తరాలనుంచి మనుగడ సాగిస్తున్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు కూడా ప్రజల మన్ననలు పొందుతున్నారు. అలాగే అనేక మంది విదేశాలకు ఉపాధికోసం వెళ్లి స్థిరపడి పురోగతి సాధిస్తున్నారు. 3.5 కోట్ల మంది జనాభాతో దాదాపు 25 లక్షల మంది వలస కార్మికులకు ఆతిథ్యం ఇస్తున్న కేరళలో రెండవ తరానికి చెందిన వారు ఇక్కడే పుట్టి పెరిగి, ఇక్కడే ఉద్యోగాలు, వృత్తులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చత్తీస్‌గఢ్ నుంచి పొట్టచేత పట్టుకుని ఉపాధి వెతుక్కుంటూ వచ్చిన కూలీ జీవితం కొంతమంది విద్వేషానికి కిరాతకంగా హతమొందడం తీవ్ర సంచలనం కలిగిస్తోంది. చత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన దళిత కార్మికుడు రామ్‌నారాయణ్ బఘేల్‌ను కేరళలోని పలక్కాడ్‌లో కేవలం స్థానిక భాష మలయాళం రాలేదని అవమానించడం, బంగ్లాదేశ్ నుంచి వచ్చావా అని ప్రశ్నించడం, చివరకు గాయం లేని అవయవం మిగలకుండా హింసించడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఆటవిక కిరాతక చర్యకు పాల్పడిన వారిలో ఐదుగురిని అరెస్టు చేశారు. వారిలో చాలామందికి ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలున్నాయని బయటపడింది.
రాష్ట్రంలోని బిజెపి, కేంద్రంలోని బిజెపి నాయకులు దీనిపై ఎలాంటి స్పందన చెందలేదు. నిందితులు గతంలో కూడా సిపిఎం కార్యకర్తలపై దాడిచేసినట్టు నేరాలు నమోదై ఉన్నాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకుంటామన్నారు. ఇంతటితో ఈ ద్వేషాగ్ని చల్లారదు. ఈ సంఘటన కేవలం యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దీని మూలాలు ఇస్లాంకు వ్యతిరేకంగా సాగుతున్న దాడులతో ముడిపడి ఉంటున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో కూడా విదేశాల నుంచి వచ్చిన వారిపై భాషాపరంగా ద్వేషపూరిత వైఖరితో బెదిరింపులు సాగుతుండడం ఇటీవల జరుగుతోంది. పర్షియా, ఉర్దూ, హిందీ, పంజాబీ, ఇంగ్లీష్, తదితర భాషలు మాట్లాడేవారు ఎందరో ఢిల్లీలో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరూ ఫలానా భాషే ఢిల్లీలో ఆధిపత్యం వహిస్తుందని చెప్పలేరు. అలాంటి పరిస్థితుల్లో రెండు వారాల క్రితం బిజెపి కౌన్సిలర్ ఒకరు ఢిల్లీ సాంస్కృతిక చరిత్రకు భిన్నంగా పబ్లిక్ పార్కులో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం చర్చనీయాంశం అయింది. పబ్లిక్ పార్కులో బిజెపి కౌన్సిలర్ రేణూ చౌదరి ఒక ఆఫ్రికన్ ఫుట్‌బాల్ కోచ్‌ను నెలరోజుల్లో హిందీ నేర్చుకోవాలని లేకుంటే ఢిల్లీని విడిచిపెట్టిపోవాలని హుకుం జారీ చేశారు. ఆమె తర్కం భారతీయ వలసదారులపై ద్వేషం వ్యాపించేదిగా విమర్శల పాలైంది. కేరళ లోని పలక్కాడ్‌లో ఇలాంటి మతద్వేష దాడి ఆదివారం రాత్రి జరిగింది. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ ప్రార్థనాగీతాలు ఆలపిస్తున్న గాయక బృందం లోని చిన్నపిల్లలపై సంఘ్ పరివార్ కార్యకర్త దాడి చేసి వారి సంగీత వాయిద్యాలను ధ్వంసం చేశాడు. దీనిపై ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త అశ్విన్ రాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
కానీ బిజెపి నాయకులు ఈ దాడిని బాహాటంగా సమర్ధించడం విమర్శలకు దారితీస్తోంది. క్రైస్తవ గీతాలు ఆలపిస్తున్న వారంతా తాగిన మత్తులో అనేక సమస్యలను సృష్టిస్తున్నందున దాడి చేయడంలో తప్పేముందని బిజెపి నాయకులు ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ఇలా దాడిని సమర్థిస్తున్న బిజెపి నాయకుల తీరును సిఎం విజయన్ తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఈ దాడిపై సిపిఎంలోని డివైఎఫ్‌ఐ కార్యకర్తలు రాష్ట్రం మొత్తం మీద ఆందోళనలను సాగిస్తున్నారు. చారిత్రక, సాంస్కృతిక, మతసామరస్య వాతావరణాన్ని కొన్ని శతాబ్దాలుగా అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న కేరళ రాష్ట్రం ఇప్పుడు మితవాద శక్తుల అరాచకత్వంతో ప్రమాదంలో పడుతోంది. ఈ మితవాద శక్తులకు దేశం మొత్తం మీద కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రక్షణ కల్పించి ప్రోత్సహిస్తోందన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. బిజెపి పాలిత ఉత్తరభారత రాష్ట్రాల్లో క్రైస్తవులపై దాడులు విపరీతంగా పెరిగాయి. ఆ ప్రభావం కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలపై కూడా వ్యాపించే ప్రమాదం ముంచుకొస్తోందన్న భయం కలుగుతోంది.
దేశంలో గత పదేళ్లలో మోడీ పాలనలో క్రైస్తవులపై దాడులు 500% పైగా పెరిగాయని నివేదికలు వెల్లడించడం అత్యంత శోచనీయం.హిందువులను బలవంతంగా క్రైస్తవ మతం లోకి మార్పిడి చేయిస్తున్నారన్న ఆరోపణలతో బిజెపి పాలిత ఉత్తర భారత రాష్ట్రాల్లో ముఖ్యంగా 20242025 కాలంలో దాడులు విపరీతంగా పెరిగాయని మానవ హక్కుల సంస్థలు వెల్లడించాయి. ఈ దాడులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగిస్తున్నాయి. బిజెపి అగ్ర నాయకత్వం కేరళ వంటి రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజంతో సత్సంబంధాలు నెరపడానికి, తద్వారా రాజకీయంగా పట్టు సాధించి ఎన్నికల్లో ఓట్ల బ్యాంకు కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఉత్తర భారతంలో జరుగుతున్న దాడులపై బిజెపి అధిష్ఠానం మౌనం వహించడంలో ఉద్దేశమేమిటో అర్థంకావడం లేదు. క్రిస్మస్ పండగ సమయంలో క్రైస్తవులపై దాడులు మరింత పెరుగుతాయని, ఈ క్లిష్ట పరిస్థితులపై తక్షణమే జోక్యం చేసుకోవాలని యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ముందుగానే లేఖ రాసినప్పటికీ ఆయన ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపించడం లేదు. దీనికి ఉదాహరణ ఆదివారం రాత్రి కేరళలోని క్రైస్తవ పిల్లలపై సంఘ్ పరివార్ జరిగిన దాడులే.