మరో సినీ నటుడు మాటతూలాడు. స్త్రీని మనిషిగా కూడా చూడని తెగకు చెందిన కొందరు మగవాళ్ళ జాబితాలో మరొక మనిషి చేరిపోయాడు. భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదు కూడా ఇచ్చి గౌరవించిన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ బహిరంగ వేదికలమీద స్త్రీలను గురించి ఎంత నీచంగా మాట్లాడతాడో అందరికీ తెలిసిందే. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ అంశం మీద తీవ్రమైన చర్చ జరుగుతున్నది. ఇటువంటి సంఘటనలు బాధితుల మీద ఎంతటి ప్రభావం చూపుతాయో ఇవాళ ‘సమగ్ర‘ లో ప్రచురిస్తున్న నలుగురు మహిళల అభిప్రాయాల్లో ఒక చిన్నారి కూడా ఉండటం తెలుపుతున్నది. 12 ఏళ్ల వయస్సు లో ఏడవ తరగతి చదువుతున్న శ్రీనిక లింగాల నటుడు శివాజీ వ్యాఖ్యలకు ఆగ్రహించి రాసిన ‘మహిళలు గొంతెత్తాల్సిందే‘ వ్యాసం అందుకు ఉదాహరణ. మురికి అభిప్రాయాలను అంత సులభంగా ఎలాగూ మార్చలేం. కనీసం బహిరంగ వేదికలమీదనైనా ఇటువంటి అవాకులు చవాకులు పేలే వాళ్లకు కనువిప్పు కలిగేది ఎప్పుడు?
మహిళలపై ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినప్పుడు, అలా చేసిన వ్యక్తి గురించి ‘అతను ఏమన్నాడు?’, ‘తన గురించి తాను ఏమనుకుంటున్నాడు?’ అంటూ వాడివేడి చర్చలు జరుగుతున్నప్పుడు ఈ వయసులో ప్రశాంతంగా ఉండటాన్ని నేను అలవాటు చేసుకున్నాను. ఎవరుపడితే వాళ్లు చేసే ప్రతి వ్యాఖ్యకూ మహిళలు అంతంగా ఆగ్రహానికి గురికావడం అనవసరమన్నది నా అభిప్రాయం. మనది ఒక ప్రజాస్వామిక దేశం. ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ, మనకు నచ్చిన దుస్తులు మనం ధరించే స్వేచ్ఛ మనకున్నాయి. అలాంటప్పుడు మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో ఎవరో చెబితే మనమెందుకు మనస్తాపానికి గురి కావాలి? ఆ వ్యాఖ్య అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ, ‘మహిళలు ఏం ధరించాలో, ఏం ధరించకూడదో మాట్లాడే హక్కు నీకు లేదు.. ఇక చాలించు’ అంటూ ప్రజాజీవితంలో ఉన్న మహిళలు అతన్ని హెచ్చరించి ఉండాల్సింది. అలా చేసి ఉంటే అది వార్త అయ్యేది. అలా జరిగి ఉంటే, అంతగా దృష్టి పెట్టడానికి కూడా అర్హత లేని ఒక వ్యాఖ్య చేసిన శివాజీ వంటి నటుడికి ఇంతటి ప్రచారం లభించేది కాదు.
మహిళల విషయానికి వస్తే, మనం సంబంధం లేని విషయాల గురించి వాదించుకుంటూ సమయాన్ని వృథా చేస్తూ ఉంటాం. ‘శివాజీ గారి అభిప్రాయం అసంఖ్యాకమైన తెలుగు మహిళాలోకానికి అంతగా అవసరమైనదా? మనం ఎప్పుడూ ఆగ్రహానికి కేవలం ఒక అడుగు దూరంలోనే ఎందుకు ఉంటాం?’ అని మనల్ని మనం ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా? అవును, ఇలాంటి వ్యాఖ్యలను ఖండించాలి. మగవాళ్లు బహిరంగ వేదికలపై తమ పనికిమాలిన అభిప్రాయాలను వెలిబుచ్చకుండా కాస్త ఆలోచించి మాట్లాడేంత వరకూ ఇలాంటి వ్యాఖ్యలను మనం ఖండిస్తూనే ఉండాలి. నిజానికి చాలామంది పురుషులు ఈ విధంగానే ఆలోచిస్తారు. కానీ మహిళల ప్రతిస్పందన ఆవేశపూరితంగా కాకుండా, విషయపూర్వకంగా, ఆలోచనాభరితంగా ఉండాలి. పురుషులు త మకు అధికారం లేని విషయాలపై ఎందుకు మాట్లాడతారని నిలదీసే విధంగా ఉండాలి. దినపత్రికలు, వార, మాస పత్రికలు, అన్ని ర కాల మీడియా మహిళల దుస్తుల గురించి ఉత్సాహంగా చర్చిస్తున్నాయి, ఈ చర్చ శతాబ్దాలుగా మహిళలు ఎదుర్కొంటున్న లోతైన సమస్యలను పరిష్కరిస్తుందన్నట్లుగా. పురుషులు వస్తున్నారు, వెళ్తున్నారు.. మహిళల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. అభివృద్ధి సాధించాం నిజమే. కానీ ఇప్పటికీ ఒక స్కర్ట్ పొడవు గురించి మథనపడేటంత మాత్రమే అభివృద్ధి సాధించామంటే అది చాలదు.
దానికి బదులుగా మనం మహిళల జీవితాలను నిజంగా ప్రభావితం చేసే విషయాలపై ఎందుకు దృష్టి పెట్టకూడదు? కుటుంబాలలో మహిళలకు ఆస్తిలో న్యాయమైన వాటా లభిస్తోందా? విద్య, వివాహం, వృత్తి వంటి జీవితాన్ని మార్చే నిర్ణయాలు తీసుకోకుండా బాలికల గొంతును అణచివేస్తున్నారా? ఇవే మహిళల భవిష్యత్తును తీర్చిదిద్దే పోరాటాలు. అంతేకానీ దుస్తుల గురించి వెల్లడించే తాత్కాలిక అభిప్రాయాలు కాదు. మహిళలు సహనశీలురు. వేదికలపై గొంతెత్తి మాట్లాడగలరు. వారు ధైర్యంగా ముందుకు సాగుతూనే ఉంటారు ఎందుకంటే ఎదురొడ్డి నిలబడటం వారి ప్రధాన లక్షణం. పురుషులు, వారి అభిప్రాయాలు వస్తూ పోతూనే ఉంటాయి, మహిళలు సురక్షితమైన, మరింత న్యాయమైన, గౌరవప్రదమైన ప్రపంచం వైపు తమ పయనాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. మహిళలను తక్కువ చేసి మాట్లాడటం జరుగుతూనే ఉంది. వారి విజయాలను తక్కువ చేసి మాట్లాడటం, వారికి గుర్తింపు ఇవ్వకుండా – ఒకరి కుమార్తె, మరొకరి భార్య, అసమర్థురాలైన తల్లి – ఇలాగన్నమాట. మహిళలు ఎవరెస్ట్ శిఖరాన్ని అనేకసార్లు అధిరోహించడం, నెలల తరబడి అంతరిక్షంలో తిరగడం లేదా అత్యంత ప్రమాదకరమైన పనులను చేపట్టడం వంటివి మనకు తెలుసు. అయినప్పటికీ సంభాషణ మహిళలు ఏం ధరించాలి? వాటిని ఎలా ధరించాలి? అనే వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ రకమైన ధోరణులకు మహిళలు స్వస్తి పలకాలి.- లలితా అయ్యర్, (సీనియర్ జర్నలిస్ట్)
ఉదాసీనంగా ఉండకూడదు
వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు, ఆపై ఆచితూచి, అతి జాగ్రత్తగా పదాలు ఎంచుకుని మరీ చెప్పిన క్షమాపణ, తరువాత సోషల్ మీడియాలో వెల్లువలా వచ్చిన స్పందనలు- ఇవీ మహిళల దుస్తులను ఉద్దేశించి సినిమా నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు. శివాజీ వ్యాఖ్యలను ఒక చిన్న తప్పిదంగా పరిగణించడం కష్టం. తెలుగు సినిమా పరిశ్రమలో, సోషల్ మీడియా వ్యవస్థలో మహిళలపట్ల ద్వేషం ఎంతలా పెరిగిపోయిందో, దానికి ఎలా ప్రోత్సాహం లభిస్తోందో, చివరకు దానినుంచి ఓ చిన్నపాటి క్షమాపణతో ఎలా బయటపడుతున్నారో చెప్పేందుకు ఈ సంఘటన ఒక స్పష్టమైన ఉదాహరణ. ఈ నేపథ్యంలో.. తాను చేసిన వ్యాఖ్యలకు శివాజీ చెప్పిన క్షమాపణ ఎందుకు ఎంతమాత్రం చాలదో చర్చించవలసిన అవసరం ఉంది.
చాలాకాలంగా సరైన అవకాశాలు లేని నటుడు శివాజీకి ‘కోర్ట్ -స్టేట్ వర్సెస్ ఏ నోబడి’ చిత్రం ద్వారా మంచి బ్రేక్ లభించింది. ఈ చిత్రాన్ని నటుడు నాని తన వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై నిర్మించారు. ‘బిగ్‌బాస్ సీజన్-7’ తర్వాత అతడికి లభించిన మరో ముఖ్యమైన అవకాశం త్వరలో విడుదలకానున్న ‘దండోరా’ చిత్రం. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఒక వేదికపై మాట్లాడుతూ శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. మహిళలు రెచ్చగొట్టే విధంగా దుస్తులు ధరిస్తున్నారని, అవి గౌరవానికి విరుద్ధమని చెప్పడమే కాకుండా, మహిళల శరీరాలను అవమానకరంగా ప్రస్తావిస్తూ అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. చీరకట్టుకుని శరీరాన్ని కప్పుకోవాలంటూ అనవసరమైన సలహాలు కూడా ఇచ్చాడు. నిధి అగర్వాల్, సమంత రూత్ ప్రభు వంటి నటీమణులపై అభిమానులు ఇటీవల జరిపిన దాడులు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన వేళ అలాంటి సందర్భాల్లో అభిమానుల ఆగడాలను సమర్థించే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి.
‘మహిళలపై గౌరవం’ అనే ముసుగులో శివాజీ చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక ‘స్టంట్’ అని అనిపించక మానదు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కనిపించాలంటే ట్రెండ్‌నే ప్రధానంగా చూస్తారు. అందుకు మహిళలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం ఒక దగ్గరి దారిగా మారిపోయింది. ఈ కోణంలో చూస్తే, శివాజీ తనకు కావలసినంత ఆన్‌లైన్ అటెన్షన్ దక్కించుకున్నాడు. పాప్యులారిటీ ఎలా వచ్చినా పర్లేదు అనుకునే ఇప్పటి పరిస్థితిలో శివాజీకి జరిగే నష్టం పెద్దగా ఏమీ లేదు. మహా అయితే కొన్ని తిట్లు, మరికొన్ని చీవాట్లు. తాజా ఉదంతంలోనైతే, శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ మా అధ్యక్షుడికి వాయిస్ ఆఫ్ ఉమెన్ టిఎఫ్‌ఐ లేఖ రాయడం, అంతే. అంతటితో ఈ వివాదానికి తెర పడుతుంది. ఈ క్రమంలో శివాజీకి కావలసినంత పబ్లిసిటీ లభిస్తుంది. మహిళా ద్వేషులనుంచి కాస్త సానుభూతి కూడా దక్కుతుంది.
మహిళల వయసు, వేషధారణతో సంబంధం లేకుండా వారిపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా శివాజీ వంటివారికి అవేమీ పట్టవు. గౌరవం, సంస్కృతి అనే ముసుగులో మహిళలపై తీర్పులు చెప్పడం, అవమానకర వ్యాఖ్యలు చేయడమనే సంస్కృతి ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. తమ తమ ఎజెండాలనుబట్టి సెలబ్రిటీలు కూడా ఈ ధోరణిలో భాగమవుతున్నారు.వీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రతిసారీ నిరసనలు వెల్లువెత్తుతాయి. కానీ బాగా నిరాశ కలిగించే అంశమేమిటంటే, సోషల్ మీడియాలోని కామెంట్ల సెక్షన్ లో ఇలాంటి వ్యాఖ్యలకు మద్దతే ఎక్కువగా లభిస్తూ ఉండటం. సంస్కృతి, భారతీయ విలువలు, గౌరవంవంటి పదాలు చివరకు మహిళలపై నియంత్రణ సాధించే ఆయుధాలుగా మారుతున్నాయి.
ఇంటర్నెట్ అనేది సమాజానికి అద్దంలాంటిది. ఆన్‌లైన్‌లో స్త్రీద్వేషానికి లభిస్తున్న మద్దతు, వాస్తవ ప్రపంచంలో ఉన్న పితృస్వామ్య ఆలోచనలకు ప్రతిబింబమే. ఈ సందర్భంలో ఆండ్రూ టేట్ ఉదాహరణ ప్రస్తావించాల్సిందే. ‘బిగ్ బ్రదర్’ షోలో పాల్గొన్న ఈ వ్యక్తి ఒక దశలో మహిళా వ్యతిరేక వ్యాఖ్యలతో టిక్‌టాక్‌లో డొనాల్డ్ ట్రంప్, కిమ్ కర్డాషియన్‌లను మించిపోయాడు. చివరకు అతడు సోషల్ మీడియా నుంచి నిషేధానికి గురయ్యాడు. కానీ అప్పటికే యువత ప్రమాదకరమైన అతడి ప్రభావానికి తీవ్రంగా లోనైంది. ఈ నేపథ్యంలో చూస్తే శివాజీ వ్యాఖ్యలు, ఆపై వచ్చిన అస్పష్టమైన క్షమాపణ, ప్రెస్‌మీట్, వేలాది రీల్స్, కోట్ల వ్యూస్, నిరసనలు.. ఇవన్నీ విపరీతమైన ప్రచారాన్ని ఇచ్చాయి.
ఇలాంటి పరిస్థితులలో ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసిన వైరల్ స్టంట్ కాకూడదని ఆశిద్దాం. ఎందుకంటే కేవలం వైరల్ అయ్యే ఉద్దేశంతోనే ఇలా చేస్తుంటే గనుక, ఆ ప్రభావం యువతపై పడి, వారి మనసులను కలుషితం చేస్తుంది. ఇలా బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేసేవారిపై చర్యలేమీ తీసుకోకుండా వదిలేస్తే ఇలాంటి వారు మరికొందరు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంటుంది. శివాజీ వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి, ప్రమాదకరమైనవీ. అవి అసభ్యపదజాలంతో కూడుకున్నవి మాత్రమే కావు. మహిళలపై దాడులు చేసేవారిని సమర్థించేవిగా ఉన్నాయనే సంగతి గమనార్హం. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన శివాజీపై తెలుగు చిత్ర పరిశ్రమ కఠిన చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో అది సమాజానికి మాత్రమే కాదు, ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న తెలుగు సినీ పరిశ్రమ ప్రతిష్ఠకు కూడా తీవ్రమైన నష్టం కలిగిస్తుంది.- రాజేశ్వరీ కల్యాణం(ఇండిపెండెంట్ జర్నలిస్ట్)
అమ్మాయిలు గొంతెత్తాల్సిందే!
స్త్రీ ద్వేషంపై నిరసనలు ఎప్పుడూ బహిరంగంగా, హింసాత్మకంగా ఉండవు. చాలాసార్లు అవి నిశ్శబ్దంగా ఉంటాయి. ఒక అమ్మాయి తన నిరనస తెలిపేందుకు చెయ్యి పైకెత్తి, మరుక్షణంలో తాను తప్పు చేస్తున్నామోననే భయంతో ఒక్క క్షణం ఆగితే అందుకు కారణం ‘అతిగా చెయ్యకు’ అంటూ చిన్నప్పటినుంచీ ఆమెకు పెద్దలు చెప్పిన ‘సుద్దులు’ కారణం కావచ్చు. తమకు నచ్చని విషయాన్ని స్పష్టంగా చెప్పలేక తమలోతాము కుమిలిపోయే అమ్మాయిలు సమాజంలో లేకపోలేదు. చాలామంది అమ్మాయిలు ఇతరుల సౌకర్యం కోసం తమను తాము ఎలా సర్దుబాటు చేసుకోవాలో పాఠాలు వింటూ పెరుగుతారు. ‘మర్యాదగా ఉండు. అన్నిటికీ తల ఊపద్దు. ఎక్కువగా వాదించొద్దు. ఎక్కువగా నవ్వకు’.. ఇలాంటి పాఠాలు ఏమీ హాని చేయనివిగా పైకి అనిపించవచ్చు, కానీ కాలక్రమేణా అవి.. ‘విషయాలను సులభతరం చేయడమే నీ పని. ఎక్కువగా చొరవ తీసుకోవడం కాదు’ అనే స్పష్టమైన సందేశాన్ని ఇస్తాయి. అదే సమయంలో అబ్బాయిలలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేస్తారు. వారి విజయాల్ని పండుగలా జరుపుకుంటారు. అదే తరహాలో మహిళలు ఆత్మవిశ్వాసాన్ని కనబరిస్తే, నిలదీస్తారు.. విమర్శిస్తారు. ఈ అసమతుల్యత ప్రమాదవశాత్తు చోటు చేసుకునేది కాదు, చిన్నప్పటినుంచే ఉగ్గుపాలతో నేర్పేదే.
కొన్ని సందర్భాలలో స్త్రీ ద్వేషం అనేది గోరంత మాత్రమే అనిపిస్తుంది కానీ, అది మనపై శాశ్వతమైన ముద్ర వేస్తుంది. దానిపై యథాలాపంగా మాట్లాడి వదిలేయడం, మీ బాధను అతిశయోక్తిగా తోసిపుచ్చడం వంటివి జరుగుతూ ఉంటాయి. మీరు ఏం చెబుతున్నా లేదా చేస్తున్నా వాటికంటే మీరు ఎలా కనిపిస్తున్నారనే దానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమూ కద్దు. ఇలాంటివన్నీ కలగలసి.. మహిళలు తామెంత సమర్ధులైనప్పటికీ, తెలివైనవారు అయినప్పటికీ తమను తాము అనుమానించుకునేలా చేస్తాయి. ఇదొక అలవాటుగా మారుతుంది.
విచారకరమైన విషయం ఏమింటటే స్త్రీ ద్వేషం అనేది పైకి అతి సాధారణమైనదిగా కనిపించడం. చాలామంది మహిళలు దానిని సరిగ్గా గుర్తించరు కూడా. దానికి అలవాటు పడి జీవించడం నేర్చుకుంటారు. తమను బాధపెట్టే వ్యాఖ్యలకు సైతం నవ్వుతారు. తమ కోపాన్ని అణచుకుంటారు. అసభ్యకరమైన ప్రవర్తనను సైతం భరిస్తారు. ఎందుకంటే అలాంటి సంఘటనలగురించి మాట్లాడితే ఇతరులు ‘నాటకీయత’గా ముద్రవేస్తూ ఉంటారు. అందుకే, తమ మనుగడకు మహిళలు మౌనమే దారి అనుకోవడం జరుగుతూ ఉంటుంది. స్వీ ద్వేషం కే వలం మహిళలనే కాదు, అందరినీ కట్టడి చేస్తుంది. మహిళలను కట్టడి చేస్తే వారి విలువైన అభిప్రాయాలను సమాజం కోల్పోతుంది. అమ్మాయిలను అదుపుచేస్తే వారి నాయకత్వాన్ని, ఆవిష్కరణలను నష్టపోతుంది. వారి భావోద్వేగాలను బలహీనతలుగా కొట్టిపారవేస్తే సానుభూతికి విలువే లేకుండాపోతుంది. అసమానతలపై నిర్మించిన ప్రపంచం అభివృద్ధికి నోచుకోదు.
మార్పు గొప్ప ప్రసంగాలతో ప్రారంభం కాదు. వాటిని ఆకళింపు చేసుకోవడంతోనే ప్రా రంభమవుతుంది. మహిళలు తమ అనుభవాల గురించి మాట్లాడినప్పుడు వారిని నమ్మాలి. త మను కించపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేసేవారిని, తమ అలవాట్లు, సాంప్రదాయాలను హే ళన చేసే విధంగా మాట్లాడేవారిని నిలదీయాలి. గౌరవం అనేది లింగ వివక్షకు లోబడి ఉండదని, ఆత్మవిశ్వాసం అనేది ఓ వర్గానికి మాత్రమే పరిమితమైనది కాదని పిల్లలకు బోధించాలి.
స్త్రీ ద్వేషం అనేది అందరికీ సంబంధించిన సమస్య. అది మనిషి జ్ఞాపకాలలో, బయటకు చెప్పుకోలేని ఆలోచనలలో జీవిస్తుంది. దీనిని సవాలు చేయడం అంటే, ఎవరూ తమను తాము తగ్గించుకోవాల్సిన అవసరం లేని ఒక ప్రపంచాన్ని సృష్టించేందుకు వేసే ముందడుగు.శ్రీనిక లింగాల(7వ తరగతి విద్యార్ధిని)
స్త్రీ ద్వేషం.. ఆధిపత్యానికి అడ్డదారి
చిత్ర పరిశ్రమలు తాము నమ్మిన వి లువలకు కట్టుబడి పనిచేస్తాయి. స్త్రీద్వేషాన్ని ప్రదర్శించే నటీనటుల పట్ల అవి చాలా స్పష్టమైన వైఖరితో వ్యవహరిస్తాయి. హాలీవుడ్, బాలీవుడ్‌లో స్త్రీ ద్వేషాన్ని కనబరిస్తే వారి వృత్తికే ఎసరొస్తుంది. వారి కెరీర్ కు గండిపడుతుంది. వారికి ఆయా సంస్థలు మద్దతు ఉపసంహరించుకుంటాయి. దీనికి విరుద్ధంగా టాలీవుడ్‌లో ఇలాంటి ప్రవర్తనను తరచుగా చాలా తేలిగ్గా తీసుకోవడం జరుగుతోంది. భారతదేశంలో స్త్రీ ద్వేషాన్ని సమర్థించుకునేందుకు ఉపయోగించే భాష మరీ దారుణంగా ఉంటుంది. ఒక మహిళ వేధింపులకు గురైనప్పుడు లేదా ఆమెపై అభ్యంతరకరమైన భాష వాడినప్పుడు లేదా అవమానించినప్పుడు ఆమె పాశ్చాత్య ధోరణులకు అలవాటు పడుతోంది. అందుకే అలా మాట్లాడాం అని సమర్ధించుకునే ప్రయత్నం చేస్తారు. మహిళలను కించపరిచేలా మాట్లాడేవారు సాంప్రదాయం, విలువల ముసుగులో తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, పాశ్చాత్య సినీ పరిశ్రమలు స్త్రీ ద్వేషంపై స్పందించే తీరును గమనించినప్పుడు ఈ వాదనలన్నీ పసలేనివిగా తేలిపోతాయి. నటుడు శివాజీ వివాదం ద్వారా ఈ విషయం మరోసారి రుజువైంది.
ఇటీవల జరిగిన ఒక సినిమా కార్యక్రమంలో శివాజీ మహిళల దుస్తుల గురించి, వారి గౌరవం గురించి అనవసరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళలను కించపరిచే విధంగా అతను వాడిన భాష వివాదాస్పదమైంది. బిగ్ బాస్ లో పనిచేసినప్పుడు శివాజీ పదేపదే మహిళల పట్ల ద్వేషపూరిత ప్రవర్తనను ప్రదర్శించాడు. మహిళా పోటీదారులను తిట్టాడు. వారి స్వభావాన్ని ప్రశ్నించాడు. ఒక సందర్భంలో ఒక కుమార్తె ఇలాగే ప్రవర్తిస్తే, ‘ఆమె మెడపై కాలు వేసి తొక్కేస్తానని‘ పేర్కొన్నాడు. ఈ డాక్యుమెంట్ నమూనా ఉన్నప్పటికీ, బిగ్ బాస్ తర్వాత శివాజీని ‘కోర్ట్’ సినిమాకు ఎంపిక చేయడం గమనార్హం. సోషల్ మీడియాలో ప్రజలు ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ నిర్మాత అయిన నానిని విమర్శిస్తున్నారు.
బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, అక్కినేని, చలపతిరావు వంటి సీనియర్ నటులు కూడా గతంలో బహిరంగ వేదికలపై అనుచితమైన, స్త్రీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే, నిరంతరం నిరసనలు ఎదురవుతూ ఉండటంతో వారు అలాంటి వ్యాఖ్యలు చేయడం మానేశారు.
హాలీవుడ్ కు, టాలీవుడ్ కు తేడా ఇదే. హాలీవుడ్ లో స్త్రీలపై చేసే అభ్యంతరకరమైన వ్యాఖ్యలను వ్యక్తిగత అభిప్రాయాలుగా పరిగణించరు. గతంలో చాలామంది పేరున్న నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు ఇలాంటి వ్యాఖ్యలు చేసి, తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయి. నటుడు జానీ డెప్ తనకు అభ్యంతరకమైన మెస్సేజ్ లు పంపించాడంటూ నటి ఆంబర్ హెర్డ్ చేసిన ఆరోపణల కారణంగా ఆయన అనేక సినిమాలలో ప్రధానమైన పాత్రలు కోల్పోయాడు. మహిళలపై తరచూ అసహ్యకరమైన జోకులు వేసే, వ్యాఖ్యలు చేసే రస్సెల్ బ్రాండ్ పై ఒక దశలో లైంగిక దాడి ఆరోపణలు వెల్లువెత్తడంతో అనేక ప్రాజెక్టులు అతని చేజారాయి. ఇలాంటి దృష్టాంతాలు మరెన్నో ఉన్నాయి.
టాలీవుడ్ సైతం ఇటీవలి కాలంలో ఇదే పంథాను అనుసరించడం మొదలు పెట్టింది. ‘మీ టూ’ ఉద్యమ సమయంలో సాజిద్ ఖాన్, అలోక్ నాథ్ వంటివారిని అనేక ప్రాజెక్టులనుంచి తొలగించారు. వీరి చేష్టల కారణంగా సినీ పరిశ్రమ ప్రతిష్ఠ దెబ్బ తింటోందని భావించడమే అందుకు కారణం. ‘పాశ్చాత్య సంస్కృతి మనల్ని భ్రష్టు పట్టిస్తోంది’ అనే సాధారణ భారతీయ పల్లవి అర్థరహితమైనదనే విషయాన్ని ఈ సంఘటనలన్నీ నిరూపిస్తున్నాయి.
ఒకవేళ స్త్రీ ద్వేషం అనేది పాశ్చాత్య దేశాలనుంచి దిగుమతి అయిందే అయితే దానిని హాలీవుడ్ తప్పకుండా సమర్థించి ఉండేదే. కానీ, వాస్తవానికి హాలీవుడ్ అందుకు శిక్షలు విధిస్తోంది. టాలీవుడ్ విషయానికొస్తే, దాని తీరు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఇక్కడ స్త్రీ ద్వేషాన్ని భారతీయ విలువలను కారణంగా చూపి సమర్థిస్తూ, జవాబుదారీతనాన్ని మాత్రం పాశ్చాత్య ప్రభావంగా తోసిపుచ్చుతున్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడే నటులను సమర్థిస్తున్నారు. అభిమానులు వారికి మరింత రక్షణ కల్పిస్తున్నారు. బాధితులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారిని అవహేళన చేస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో స్త్రీ ద్వేషం ఒక ప్రమాదం కాదు… ఒక ప్రమాణపత్రం. ఆధిపత్యానికి ఒక అడ్డదారి.- కౌసల్య రాచవేల్పుల
(ఫ్రైడే వాల్ సౌజన్యంతో..)