ఒక మేరకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని క్రమంగా నిర్వీర్యం చేసి చివరికి రద్దు చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. నిధులు పెంచకుండా చేసి ఇప్పుడు ఆ పథకాన్నే రద్దుచేసే విధానాలు అమలు చేస్తున్నది. అందులో భాగమే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ‘వికసిత్ భారత్- జీ- రామ్ జీ (గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆ జీవక్ మిషన్ గ్రామన్) గా పేరు పెట్టింది. దీనికి సంబంధించిన బిల్లును 16- డిసెంబర్ 2025 పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఎటువంటి చర్చ లేకుండానే నిరసనల మధ్య 18 డిసెంబర్ 20-25న బిల్లును మోడీ ప్రభుత్వం చట్టంగా ఆమోదింపచేసింది. ఈ బిల్లులో పంచాయతీల ద్వారా పనులు అమలు, పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంపు, వ్యవసాయ సీజన్‌లో కూలీల కొరత లేకుండా ఉపాధి పనులను 60 రోజుల వరకు తాత్కాలిక నిలిపివేత, వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిలో పనులు, ప్రణాళికలు, వారానికి ఒకసారి కూలీ చెల్లింపు, ఎ, బి, సి లు గ్రామ పంచాయతీల విభజన, కేంద్ర నిర్ధారించిన పారా మీటర్స్ ఆధారంగా రాష్ట్రాల వారీగా ఉపాధి పనుల కేటాయింపు, కేటాయింపులకు అదనంగా నిధులు ఖర్చు చేస్తే దాన్ని రాష్ట్రాలే భరించడం, ఉపాధి పనుల కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధుల కేటాయింపు ఈ బిల్లులో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి తగ్గి, నిరుద్యోగం పెరగడం, ఉపాధి కోసం గ్రామీణ పేదలు పట్టణాలకు వలసబాట పట్టడం, ప్రభుత్వం వెడల గ్రామీణ పేదల్లో వ్యతిరేక వ్యక్తం కావడం దృష్టిలో పెట్టుకుని,ఆ వ్యతిరేకతను చల్లార్చేందుకు యుపిఎ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం తేవడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నికరమైన ఆదాయ కల్పన, వనరుల ఉత్పాదక, అభివృద్ధి లక్ష్యాలుగా 2005 లో అప్పటి యుపిఎ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి పథకం లక్ష్యంగా ప్రకటించింది. 2009లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంగా యుపిఎ ప్రభుత్వం పథకం పేరు మార్చింది. ఈ పథకం కింద జాబ్‌కార్డు పొందిన ప్రతి కుటుంబానికి 100 రోజులపని కల్పిస్తామని చెప్పింది. 2024 నాటికి దేశంలో జాబ్ కార్డులు పొందిన కుటుంబాలు 9 కోట్ల, 2 లక్షలుగా ఉన్నాయి. ఉపాధి పథకం ప్రారంభమైన దగ్గరనుంచి ఇప్పటివరకు కుటుంబాలకు వందరోజుల పని కల్పించడంలో పాలక ప్రభుత్వాలన్నీ విఫలమయ్యాయి. 2024 -25 ఆర్థిక సంవత్సరంలో 40.70 లక్షల కుటుంబాలకు వంద రోజుల పని లభిస్తే, 2025 -26 ఆర్థిక సంవత్సరంలో 6.74 లక్షల కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పని లభించింది.
యుపిఎ ప్రభుత్వ పాలనలోనే పథకాన్ని నీరుగార్చే విధానాలు ప్రారంభమై నేడు మోడీ ప్రభుత్వ పాలనలో అది తీవ్రమైంది. అందుకు అనుగుణంగానే పథకానికి నిధుల కేటాయింపులు తగ్గించడం లేదా పెంచకపోవడం జరిగింది. 4 కోట్ల, 57 లక్షల జాబ్ కార్డులు తొలగించడం చేసింది. 2025 -26 ఆర్థిక సంవత్సరంలోనే 18.34 జాబ్ కార్డులు తొలగించింది. ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌవాన్ 9- డిసెంబర్ -2025న పార్లమెంట్ కి తెలిపారు. 2025 -26 ఆర్థిక సంవత్సరంలోనే 18.34 లక్షల జాబ్ కార్డులు తొలగించింది. 2019-20, – 2024 -25 మధ్య అత్యధికంగా తొలగించబడిన జాబ్ కార్డుల సంఖ్య కోటి, 4 వేల మంది. రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా 11 మంది 11 లక్షల జాబ్‌కార్డులు తొలగించబడ్డాయి. తెలంగాణలో 3,45,445, ఒడిశాలో 80,896, ఉత్తరప్రదేశ్‌లో 91.48 లక్షలు జాబ్ కార్డులు తొలగించబడ్డాయి. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యానికి అనుగుణంగా పనిచేయక పోయినా, అవకతవకలు, అవినీతితో నిండి ఉన్నా గ్రామీణ, ఆదివాసీ ప్రజలకు పథకం కొంత మేరకు ఉపశమనంగా ఉంది. దీన్ని కూడా వారికి లేకుండా చేసేందుకే మోడీ నాయకత్వాన ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వం తెచ్చిన కొత్త గ్రామీణ ఉపాధి చట్టం. ఉపాధి పొందడం ప్రజల హక్కు. అది భిక్ష కాదు. తక్షణ ఉపాధిని డిమాండ్ చేస్తూనే, మౌలిక సమస్య అయిన భూమి కోసం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల కోసం గ్రామీణ, ఆదివాసీ ప్రజలు, కార్మిక వర్గంతో కలిసి పోరాట బాటపట్టాలి.
బొల్లిముంత సాంబశివరావు
98859 83526