భువనేశ్వర్: ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ లో ఆరుగురు నక్సల్స్ మరణించారు. వారిలో మావోయిస్ట్ అగ్రనేత గణే శ్ ఉయ్కే కూడా ఉన్నట్లు పోలీసులు గురువా రం తెలిపారు. సిపిఐ (మావోయిస్ట్) కేంద్రకమిటీ సభ్యుడైన గణేశ్ ఉయ్కే ఒడిశాలో నక్స ల్ కార్యలాపాల ఇన్ చార్జిగా ఉంటూ, ఆంధ్రప్రదేశ్ – ఒడిశా సరిహద్దుల్లో కార్యకలాపాలను పర్యవేక్షించేవాడు. గతంలో ఆయనను పట్టి ఇచ్చిన వారికి రూ.1.1కోట్ల రివార్డు ప్రకటించారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మంగళవారం నాడు మల్కన్‌గిరి జిల్లాలో పోలీసు డిజిఐ ఖురానియా ముం దు 22మంది మావోయిస్ట్‌లు లొంగిపోయిన తర్వాత బుధవారం, గురువా రం ఈ ఎన్కౌంటర్లు జరిగాయి. బెల్టర్ పోలీసు స్టేషన్ పరిధి కింద గుమ్మా అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి భద్రతా దళాలు నక్సల్స్ కోసం గాలిస్తుండగా జరిగిన ఎన్ కౌంటర్ లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు మావోయిస్ట్ లు మరణించారు. కాగా, చకపాడ్ పోలీసు స్టేషన్
ప్రాంతంలో గురువారం నాడు జరిగిన ఎదురు కాల్పుల్లో గణేశ్ ఉయ్కే తో సహా నలుగురు మావోయిస్ట్‌లు చనిపోయారని పోలీసు అధికారి తెలిపారు. వారినుంచి రెండు ఐఎన్ఎస్ ఏఎస్ రైఫిల్స్, ఒక .303 రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు. గణేశ్ తెలంగాణలోని నల్లగొండ జిల్లా జిల్లాలోని చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన వాడు. అతడిని పక్కా హనుమంతు, రాజేశ్ తివారీ, చమ్రు, రూప వంటి పలు మారు పేర్లతో పిలిచేవారు. గణేశ్ ను గుర్తించినా, ఇద్దరు మహిళలతో సహా నలుగురు నక్సల్స్ ఎవరన్నది నిర్థారణ కాలేదని పోలీసులు తెలిపారు. ఈ మధ్య ఒడిశాలో మావోయిస్ట్ లపై జరిగిన అతి పెద్ద ఆపరేషన్లలో ఇది ఒకటని పోలీసు డైరెక్టర్ జనరల్ వైబి ఖురానియా తెలిపారు. కంధమాల్ – గంజాం అంతర్ జిల్లా సరిహద్దుల్లో నక్సల్స్ కదలిక ఎక్కువ ఉండడంతో వివిధ ప్రాంతాలలో ఆపరేషన్లు చేపట్టినట్లు ఆయన తెలిపారు. బుధవారం రాత్రి ఎన్ కౌంటర్ లో చనిపోయిన నక్సల్స్ లను గుర్తించారు. వారు ఛత్తిస్ గఢ్ కు చెందిన సిపిఐ( మావోయిస్ట్ ) ఏరియా కమిటీ సభ్యుడు బారి అలియాస్ రాజేశ్, దళం సభ్యుడు అమృత్ గా గుర్తించారు. వారిద్దరి పై 23.65 లక్షల రివార్డు ఉన్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.