న్యూఢిల్లీ : కేంద్రం ఇచ్చిన పునర్ నిర్వచనం ప్రకారం ఆరావళి పర్వతాలపై 90 శాతం కంటే ఎక్కువ ప్రాంతాలు రక్షణలో ఉండవని తేలిందని, ఆ పర్వత శ్రేణులు మైనింగ్, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు వినియోగం కావచ్చని కాంగ్రెస్ గురువారం ఆరోపించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ పర్యావరణ సమస్యలపై ప్రధాని మోడీ విధానాన్ని ఎక్స్ పోస్టు ద్వారా తీవ్రంగా విమర్శించారు. ప్రధాని మోడీ గ్లోబల్ టాక్ ( ప్రపంచ చర్చ( కు, లోకల్ వాక్( స్థానిక ఆచరణ) కు మధ్య ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు.కాలుష్య నివారణ ప్రమాణాలను సడలించడం, పర్యావరణం, అటవీ చట్టాలను బలహీనపర్చడం ద్వారా పర్యావరణ సమతుల్యతపై దాడి చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. అయితే పర్యావరణ మంత్రి భూపిందర్ యాదవ్ కాంగ్రెస్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు ఆరావళి పర్వత శ్రేణిపై అటవీ సర్వే ఏదీ జరగలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందన్నారు. ఆరావళిపై మైనింగ్‌ను పూర్తిగా నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం కాంగ్రెస్‌కు దిగులు కలిగిస్తోందని విమర్శించారు. ఆరావళిపై మంత్రి తప్పుడు సమాచారంతో తప్పుతోవ పట్టిస్తున్నారని జైరామ్ రమేష్ తిప్పి కొట్టారు. ఆరావళి పునర్ నిర్వచనంపై ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం సంబంధిత రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్తగా ఎలాంటి మైనింగ్‌కు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఆరావళిలో ఎక్కడ మైనింగ్ తప్పనిసరిగా నిషేధించాలో గుర్తించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చి అండ్ ఎడ్యుకేషన్‌కు పర్యావరణ , అటవీ మంత్రిత్వశాఖ సూచించింది.